ప‌వ‌న్ సార్‌.. ప‌ట్టించుకోండి: గిరిజ‌నులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ‌ర్గాల‌కు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా ప‌నిని చేప‌డితే.. ఖ‌చ్చితంగా అది పూర్తి చేస్తార‌ని.. ఆయ‌న హామీ ఇస్తే ఆ ప‌ని నెర‌వేరుతుంద‌ని కూడా న‌మ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా ప‌నులు చేస్తార‌ని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తార‌న్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజ‌నులు మ‌రింత ఎక్కువగా ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న కూడా వారిని అలానే చూస్తున్నారు.

గిరిజ‌నుల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. గ‌త ఆరు మాసాల కింద‌ట ఇచ్చిన ఒక హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌క‌పోవ‌డంపై గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తుంది. ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోండి! అంటూ.. గిరిజ‌నులు నినాదాలు చేస్తున్నారు. ఇలా.. గిరిజ‌నులు రోడ్డెక్క‌డానికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు, దాయర్తి గ్రామాలలో ఈ ఏడాది ప్రారంభంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల్లోనిగిరిజ‌నులు ప‌డుతున్న క‌ష్టాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజ‌నుల‌కు డోలీ మోత‌ల క‌ష్టాలు రాకుండా లేకుండా చేసేందుకు అంద‌మైన ర‌హ‌దారులు నిర్మిస్తా మ‌ని హామీ ఇచ్చారు. ఈ హామీ మేర‌కు.. గుమ్మంతి- రాచకీలం, రాచకీలం- రెడ్డిపాడు, బల్లగరువు- వాజంగి, పీచుమామిడి- గుమ్మంతి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంత‌రం.. ఈ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయా ర‌హ‌దారుల‌కు శంకుస్థాప‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆ ప‌నుల‌ను ప‌ట్టిం చుకోలేదు. క‌నీసం.. ఒక్క ప‌నిని కూడా ముందుకు తీసుకువెళ్ల‌లేదు. దీంతో తాజాగా గిరిజ‌నులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని 11 పీవీటీజీ గ్రామాల్లో గిరిజనులు ప‌వ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. తాము ఏ ప‌నుల కోసం బ‌య‌ట‌కు రావాల‌న్నా.. త‌మ‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం లేద‌ని.. ఈక్ర‌మంలో ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోవాలని .. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల‌ని ఇక్క‌డి వారు కోరుతున్నారు.