అన్న‌పై మ‌రిన్ని క్లూలిచ్చిన ష‌ర్మిల‌

త‌న అన్న‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసును కూట‌మి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుని విచారించాల‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల స‌ర్కారును డిమాండ్ చేశారు. ఈ స‌మ‌యంలో ఆమె మ‌రికొన్న అంశాల‌ను కూడా ప్ర‌స్తావించారు. ఈ విష‌యాల‌పై దృష్టి పెట్టాలి.. అంటూ.. సీఎం చంద్ర‌బాబును కోరారు. కాగా.. ఈ కేసులో ఇప్ప‌టికే కీల‌క పాత్ర ధారులుగా ఉన్న నాయ‌కుల‌ను, వ్యాపార వేత్త‌ల‌ను, అధికారుల‌ను కూడా అరెస్టు చేసి.. జైలుకు త‌ర‌లించారు.

ఇక, ఇప్పుడు ఈ కేసులో భారీ ఎత్తున సొమ్ములు చివ‌ర‌కు ఎవ‌రికి చేరాయ‌న్న విష‌యంపై దృష్టి పెట్టారు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల స్పందిస్తూ.. డిజిటల్ మాధ్య‌మంలో న‌గ‌దు లావాదేవీలు జ‌ర‌గాల్సిన చోట‌.. కేవ‌లం క్యాష్‌ను మాత్ర‌మే తీసుకున్నార‌ని.. అంటే.. న‌గ‌దు చేతులు మారి.. చివ‌ర‌కు ఎవ‌రికి చేరాలో వారికి చేరింద‌ని ఆరోపించారు. నాన్ డ్యూటీ లిక్క‌ర్‌ను ఎక్కువ‌గా అమ్మారని తెలిపారు. ప‌న్నులు కూడా ఎగ్గొట్టార‌ని తెలిపారు. వీట‌న్నింటిపైనా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) అధికారులు, ముఖ్య‌మంత్రి సైతం దృష్టి పెట్టాలి.

ష‌ర్మిల ఇచ్చిన క్లూలు ఇవీ..

  • బ్లాక్‌ మనీ కోసమే డిజిటల్‌ పేమెంట్‌ను నిలిపివేశారు.
  • డిజిటల్ పేమెంట్స్ కాకుండా.. క్యాష్ తీసుకున్నారు. పన్నులు ఎగ్గొట్టాలనే ఇలా చేశారు.
  • డిజిటల్ పేమెంట్ ఆపడం‌ వెనుక ఎంత మేర‌కు అవినీతి జ‌రిగింది?
  • నాన్‌ డ్యూటీ పేమెంట్‌లు మొత్తం ‘బ్లాక్‌’లో జరిగాయి.
  • నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు?
  • బ్రాండెడ్ లిక్క‌ర్ అమ్మ‌కాలు పూర్తిగా ఆపేశారు. చీప్‌ లిక్కర్ ప్రోత్స‌హించారు. దీనికి కార‌ణం ఏంటి?
  • ఐదేళ్లలో 30 లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయి.
  • 30 వేల మందికి లివ‌ర్ స‌మ‌స్య కార‌ణంగా చనిపోయారు.