భార‌తీయుల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్దు: ట్రంప్ ఆర్డ‌ర్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాల‌కు కేంద్రం. ఆయ‌న ఎక్కడ నోరు విప్పినా, వివాదం తాండవం ఆడుతుంది. తాజాగా దేశ రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో జ‌రిగిన ఏఐ స‌ద‌స్సులో ట్రంప్ మాట్లాడుతూ, స్థానికతపై స్పష్టమైన లెక్చర్ ఇచ్చారు.

అమెరికా కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాల‌ని సూచించారు. లేకపోతే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా భారతీయ ఉద్యోగుల‌ను నియ‌మించ‌డంపై ట్రంప్ గట్టిగా స్పందించారు.

“ఇక్కడ మనకు అపార‌మైన యువ శక్తి ఉంది. అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారిని కాదని మీరు భారతీయుల‌ను తెచ్చుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక నుంచి అలా చేయొద్దు. భారత్ సహా ఇతర దేశాల నుంచి పౌరులను ఉద్యోగాల్లో నియమించే బ‌దులు మన అమెరికన్ల‌కే వాటిని ఇవ్వాలి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల‌ను ఆయ‌న ఐటీ వర్గాల‌ను ఉద్దేశించి చేసిన‌ట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అంతేకాదు, పెట్టుబడుల విష‌యంలో కూడా ట్రంప్ గట్టిగానే స్పందించారు. విదేశాల్లో పరిశ్రమలు పెట్టే వారికి ఇకపై సబ్సిడీలు ఇవ్వబోమన్నారు.

“మీరు పరిశ్రమ పెట్టాల‌ని అనుకుంటే, ఇక్కడ మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని వాడుకోండి. భారత్, చైనా అంటూ పరుగు పెట్టడం సరికాదు. ఇక నుంచి మీరు పెట్టుబడులు పెట్టేప్పుడు ఆలోచించుకోండి. మన దేశం, మన భూమి, మన ప్రజలు, మన ఆర్థిక వ్యవస్థ… వీటిని బలోపేతం చేయండి” అని ట్రంప్ సూచించారు.

ప్రపంచీకరణను కూడా ట్రంప్ తప్పుబట్టారు. “గ్లోబలైజేషన్ ఆలోచనను మానేయాలి” అంటూ రాడికల్ గ్లోబలైజేషన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

దీనివల్ల అమెరికా ప్రజల అవకాశాలను ప్రపంచ దేశాలు దోచుకున్నాయని అన్నారు. ఇక నుంచి ఆ విధానం వద్దన్నారు. స్థానిక ఉద్యోగులకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, అందరూ ఒకమాటగా కలిసి ప్రజల మేలుకోసం పనిచేయాలని సూచించారు.