భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హఠాత్తుగా ఆయన నిర్ణయం తీసుకోవడం, ఆ రాజీనామాను అంతే వేగంగా ఆమోదించడం వంటివి కేంద్రంపై అనుమానాలు పెంచేలా చేశాయి. నిజానికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన మూడు రోజులు అయింది. సోమవారం సాయంత్రం ఆయన నిర్ణయం తీసుకోవడం, రాత్రికి రాత్రి రాజీనామా చేయడం, ఆ తెల్లవారే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిని ఆమోదించడం తెలిసిందే.
అయితే దీనిపై చర్చ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. అనేక కారణాలు, అనుమానాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా కేంద్రంలోని మోడీ సర్కారుపైనే వేళ్లన్నీ చూపుతుండడం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో కేంద్రం జోక్యం పెరిగిపోయిందన్న విమర్శలు ఇప్పుడు మరోసారి ముసురుకున్నాయి.
రాజ్యసభలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జస్వంత్ వర్మ, జస్టిస్ శేఖర్‌లపై ఒకేసారి అభిసంశన తీర్మానాలు తెరమీదికి వచ్చాయి. జస్టిస్ వర్మ ఇంట్లో వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు కాలిపోయి ఉండడం వెలుగు చూసిన తర్వాత విమర్శలు వచ్చాయి. న్యాయవ్యవస్థలో అవినీతిపై చర్చ కూడా జరిగింది.
దీంతో జస్టిస్ వర్మను తప్పించడం ద్వారా వచ్చే క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది. ఆగమేఘాలపై సంతకాల సేకరణ కూడా చేసింది. ఇంతలోనే జస్టిస్ శేఖర్ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టారని, ఆయనను కూడా అభిసంశించాలని ప్రతిపక్షం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విషయంలో బీజేపీ డిఫర్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్‌ఎస్ఎస్ అనుకూలంగా ఉండడంతో బీజేపీ విముఖత చూపింది.
జస్టిస్ శేఖర్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాసాన్ని చైర్మన్ హోదాలో జగదీప్ ధన్‌ఖడ్ స్వీకరించారు. ఇది కేంద్రానికి మంటపుట్టించిందన్న చర్చ ఉంది. ఈ కారణంగానే ఆయనను తప్పించాలని కోరినట్టు జాతీయ మీడియాలో వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, బీహార్‌లో ఎన్నికలు ఉన్నందున అక్కడ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించుకుని ముఖ్యమంత్రి సీటును సొంతం చేసుకోవాలన్న వ్యూహంతో, మిత్రపక్షం జేడీయూ నేత ప్రస్తుత సీఎం నితీష్ కుమార్‌ను నేరుగా తీసుకువచ్చి ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టాలన్న వ్యూహం ఉందన్నది మరో చర్చ.
అందుకే ధన్‌ఖడ్‌ను తప్పించారన్నది పెద్ద ఎత్తున సాగుతున్న విశ్లేషణ. అయితే దీనిలో ఏది నిజమైనా, అది ప్రధాని మోడీకే మచ్చలు, మరకలు తెచ్చేలా ఉంటుందన్నది మరో మాట. రాజ్యాంగబద్ధమైన పదవులను కూడా రాజకీయాల కోసం శాసిస్తున్నారా? అనేది జాతీయ మీడియాలో వస్తున్న విశ్లేషణ. మరి చివరకు ఏం తేలుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates