ఎడారిలో పూలు పూయించారు.. మ‌నం చేయ‌లేమా?: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు సంక్షేమం ఇస్తూనే మ‌రోవైపు.. అభివృద్ధిని ఆయ‌న స్వ‌ప్నిస్తున్నారు. పెట్టుబ‌డుల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ఈ క్ర‌మంలో దుబాయ్‌ని ఆయ‌న ఆద‌ర్శంగా తీసుకుంటున్నాన‌ని చెప్పడం విశేషం. ఎడారి దేశంలో అభివృద్ధి పూలు పూయిస్తున్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. మ‌నం ఆ మాత్రం చేయ‌లేమా? అని వ్యాఖ్యానించారు. తాజాగా విజయ‌వాడ‌లో ‘ఇన్వెస్టోపియా గ్లోబ‌ల్ ఏపీ’ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. వీరంతా ప్ర‌పంచ వ్యాప్తంగా పెట్టుబ‌డులు పెట్టిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఎడారి దేశం దుబాయ్‌లోనే అభివృద్ధి ప‌రుగులు పెడుతోంద‌ని, ప‌ర్యాట‌కం, బీచ్‌లు స‌హా.. ఆకాశ హ‌ర్మ్యాలు నిర్మించి.. ప్ర‌పంచ దేశ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నార‌ని చెప్పారు. ఆ దేశాన్ని చూస్తే.. త‌న‌కు అసూయ‌గా ఉంద‌న్నారు. అలాంటి దేశంలోనే అభివృద్ధి సాకారం అయిన‌ప్పుడు ఏపీలో కాదా? అని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల‌లో అనేక విధ్వంసాలు జ‌రిగాయ‌ని.. ప్ర‌తి ప‌నికీ అప్పులు చేసుకున్న ప‌రిస్థితి క‌నిపిం చింద‌న్నారు. ఆ ప‌రిస్థితి, సంక్షోభాల నుంచి రాష్ట్రాన్ని గ‌ట్టెక్కించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌న్నారు. కొత్త‌గా ఆలోచించి.. కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. దుబాయ్‌లాంటి అభివృద్ధి ఏపీలోనూ సాకారం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలిపారు. దుబాయ్‌తో భార‌త్‌కు అవినాభావ సంబంధాలు ఉన్నాయ‌న్న చంద్ర‌బాబు.. భారతీయులు 40 శాతం మంది దుబాయ్‌లో ఉన్నార‌ని తెలిపారు.

2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ మారుతుందన్న చంద్ర‌బాబు .. ఈ క్ర‌మంలో ఏపీలోనూ అభివృద్ధిని సాధించేందుకు విజ‌న్‌-2047 రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. ఇక నుంచి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌నులు కోరుకునే వారు ఏ ఆఫీసు చుట్టూ తిర‌గ‌కుండా.. వాట్సాప్ ద్వారా పాల‌న అందిస్తున్న‌ట్టు చెప్పారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీ ఇప్పుడు స్వ‌ర్గ‌ధామంగా మారింద‌న్న ఆయ‌న‌.. పెట్టుబ‌డిదారులు త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.