‘ద్వారంపూడి’ ద్వారాల‌కు పొలిటిక‌ల్ తాళం..!

ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వివాదాస్ప‌ద వైసీపీ నాయ‌కుల జాబితాలో తొలి ముగ్గురిలో ఈయ‌న పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. నిరంతరం మీడియా ముందుకు వ‌చ్చి.. జ‌న‌సేన‌ను టార్గెట్ చేసిన ద్వారంపూడి.. త‌ర్వాత‌.. కాలంలో కూడా.. రెచ్చిపోయారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌. కూడా త‌న ప్రాభ‌వం తగ్గ‌ద‌ని చెప్పారు. అయితే.. ఆ మాట అన్నా.. కూడా.. ఆయ‌న ప్రాభ‌వం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఎవ‌రి నోటా.. ఇప్పుడు ద్వారంపూడి మాట వినిపించ‌డం లేదు. కాకినాడ సిటీ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న రెండు సార్లు కూడా ఆయ‌న అప్ర‌తిహ‌తంగా రాజ‌కీయాలు చేశారు. కానీ, గ‌త ఏడాది కూట‌మి విజయం దక్కించుకోవ‌డం.. ముఖ్యంగా పౌర‌స‌ర‌ఫరాల శాఖ‌ను జ‌న‌సేన తీసుకున్న‌ ద‌రిమిలా.. ద్వారంపూడికి ప్రాణప్ర‌ద‌మైన రైస్ వ్యాపారం పై పెద్ద పిడుగే ప‌డింది. ముఖ్యంగా రైస్ ఎగుమ‌తులు.. మిల్లుల‌ పై ఆయ‌న ఆధిప‌త్యం దాదాపు పోయింద‌నే టాక్ వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు రెండు గోదావ‌రి జిల్లాల్లోనే కాదు.. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లోనూ రైస్ బిజినెస్ అంటే.. ద్వారంపూడి పేరు వినిపించేది. కానీ, ఓడ‌లు బ‌ళ్లు-బ‌ళ్లు ఓడ‌లు అయిన‌ట్టుగా.. జ‌న‌సేన విజ‌యంతో చంద్రశేఖ‌ర్‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంది. ఇప్పుడు ఆయ‌న పేరు కానీ..ఊరు కానీ.. వినిపించ‌డం లేదు. వాస్త‌వానికి.. వైసీపీకి ఉన్న బ‌లమైన వాయిస్ ల‌లో కోడాలి నాని త‌ర్వాత‌.. ప్లేస్‌ ద్వారంపూడిదే. దీంతో ఆయ‌న పార్టీకి, అధినేత జ‌గ‌న‌కు కూడా అనుకూలంగానే ఉన్నారు. ఎప్పుడైతే.. ఆయ‌న ప‌వ‌న్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించారో.. అప్పుడే మైన‌స్ అయ్యారు.

ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో ద్వారంపూడి అనుచ‌రులు కూడా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు వంద‌ల మంది ఆయ‌న చుట్టూ ఉండేవారు. కానీ, ఇప్పుడు ప‌ట్టుమ‌ని ప‌ది మంది మాత్ర‌మే క‌ని పిస్తున్నారు. అంతేకాదు.. ఆయ‌న ను స‌మ‌ర్థించే వ్యాపారులు కూడా చీలిపోయారు. దీంతో ద్వారంపూడి రాజ‌కీయాలు దాదాపు బ్రేక్ వేసిన‌ట్టు ఆగిపోయాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. ఇది శ్వాశ్వ‌తమా.. కాదా.. అనేది వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఏదీ శాశ్వ‌తం కాదు క‌దా!. అందుకే ద్వారంపూడికూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. త‌న టైం కోసం ఎదురు చూస్తున్నార‌ట‌.