గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి రాజ‌కీయ‌మా… మ‌జాకానా ..!

‘మా మంచి నేత‌.’ అని ప్ర‌జ‌ల‌తో అనిపించుకునేందుకు చాలానే కృషి చేయాలి. ఇలాంటి నాయ‌కులు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అయితే.. వ‌య‌సు మీద‌ప‌డ్డా.. నిఖార్స‌యిన నాయ‌కుడిగా రాజ‌కీయాలు చేస్తున్నారు రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. ప్ర‌స్తుతం ఆయ‌న‌ 80+లో ఉన్నారు. అయితేనేం.. ఎలాంటి ఆధారం లేకుండా.. వ‌డివ‌డిగా న‌డ‌వ‌డంతోపాటు.. పొలం గ‌ట్ల‌పైనా దూకుడ‌గా ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన‌.. సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మాన్ని రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల నిర్వ‌హిస్తున్నారు. వారిని మూడు రోజుల పాటు ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. రైతుల క‌ష్టాలు , స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక అంశాల‌పై ప‌ట్టు ఉండ‌డంతో వాటిపైనా ఆయ‌న చ‌ర్చిస్తున్నారు. ఇక‌, స‌ర్కారు చేస్తున్న మంచిని కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలా.. గోరంట్ల త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నారు. వాస్త‌వానికి.. యువ ఎమ్మెల్యేలే చాలా మంది ఇంకా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురానివారు.. ప‌దుల సంఖ్య‌లో ఉన్నారు. అలాంటి స‌మ‌యంలో గోరంట్ల ప్ర‌జ‌ల మ‌ధ్య కు వ‌డివ‌డిగా రావ‌డం.. ఇక్క‌డి వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనే అతి క‌ష్టం మీద టికెట్ ద‌క్కించుకున్న గోరంట్ల అప్ప‌ట్లో ఈ ఒక్క‌సారి అంటూ.. ప్ర‌క‌టించారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి తాను బ‌రిలో నిల‌వ‌న‌ని పేర్కొన్నారు.

కానీ.. మారుతున్న ప‌రిస్థితులు.. రాష్ట్రంలో మ‌ళ్ల కూట‌మి ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌న్న సంకేతాలు వ‌స్తున్న క్ర‌మంలో గోరంట్ల మ‌రోసారి పోటీకి రెడీ అవుతున్నార‌న్న‌ది రాజ‌మండ్రి టాక్‌. అందుకే.. ఆయ‌న ఉభ‌య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా.. ఇటు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ.. మ‌రోవైపు.. త‌న వ్య‌క్తిగ‌త రాజ‌కీయాల గ్రాఫ్ ఎలా ఉందో కూడా.. చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నిక‌ల నాటికి డీలిమిటేష‌న్ ఎలానూ జ‌రుగుతుంది కాబ‌ట్టి.. మ‌రోసారి బ‌రిలో నిలిచే ఆలోచ‌న చేస్తున్నారు. ఇక‌, ప్ర‌జ‌ల స‌మస్య‌ల విష‌యంలోనూ.. రైతుల స‌మ‌స్య‌ల విష‌యంలో వెంట‌నే స్పందిస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. అందుకే.. గోరంట్ల మా మంచి నేత అయ్యారు!.