‘ఇప్పుడు బాబు టైం న‌డుస్తోంది.. మాకూ టైం వ‌స్తుంది’

Peddireddy

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌మ కుటుంబం పై క‌క్ష సాధిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆరోపించారు. క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే త‌న త‌న‌యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని త‌ప్పుడు కేసులో ఇరికించి.. జైలుకు పంపించార‌ని అన్నారు. “ఇప్పుడు చంద్ర‌బాబు టైం న‌డుస్తోంది. మాకు కూడా టైం వ‌స్తుంది. ఇంత‌కు ఇంత బ‌దులు త‌ప్ప‌దు” అని పెద్దిరెడ్డి హెచ్చ‌రించారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌ల‌పైనా ముఖ్యంగా త‌మ కుటుంబంపైనా క‌క్ష సాధింపు ధోర‌ణి కొన‌సాగుతోంద‌న్నారు. త‌న కుమారుడు ఇప్ప‌టికి వ‌రుస‌గా మూడు సార్లు ఎంపీగా విజ‌యం సాధించార‌ని.. ఎలాంటి మ‌చ్చా లేద‌ని పేర్కొన్నారు.

అయినా.. మిథున్ రెడ్డిని వేధించాల‌ని క‌క్ష పూరితంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారని.. కానీ, అది నిల‌బ‌డ‌లేద‌న్నారు. ఆ త‌ర్వాత‌.. త‌న‌పై అట‌వీ భూముల కేసు అంటూ మీడియాలో హ‌డావుడి చేశార‌ని, కానీ.. అది కూడా నిల‌బ‌డలేద‌ని చెప్పారు. మ‌రికొన్నాళ్ల‌కు మ‌ద‌న‌ప‌ల్లెలో ఫైళ్ల‌ను త‌గ‌ల బెట్టామ‌ని బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నాలు చేశార‌ని.. అప్పుడు కూడా తాము న్యాయం వైపే నిల‌బ‌డిన‌ట్టు పెద్దిరెడ్డి చెప్ప‌కొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో కేసులు పెట్టినా.. త‌మ కుటుంబం త‌ట్టుకుని నిల‌బ‌డిన‌ట్టు పెద్దిరెడ్డి వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో అస‌లు ఏ త‌ప్పూ లేని లిక్క‌ర్ పై.. కుంభ‌కోణం అనే పేరుతో క‌క్ష సాధింపు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని పెద్దిరెడ్డి విమ‌ర్శించారు. మిథున్ రెడ్డికి జ‌గ‌న్ స‌న్నిహితుడు కావ‌డం వ‌ల్లే.. కేసు పెట్టార‌ని.. ఈ కేసు న్యాయ వ్య‌వ‌స్థ ముందు నిల‌బ‌డబోద‌ని చెప్పారు. “మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు.” అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

స‌జ్జ‌ల కూడా..

ఎంపీ మిథున్ రెడ్డికి జైలు విధించ‌డం ప‌ట్ల సీనియ‌ర్ నాయ‌కుడు, వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఆధారాలు లేవని సిట్ అంగీకరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని, వేధింపుల కోసమే ఈ తప్పుడు అరెస్ట్‌లు చేస్తున్నార‌ని చెప్పారు. సీఎం చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన హయాంలో లిక్కర్ స్కాంపై కేంద్ర దర్యాప్తు కోరాలని అన్నారు. ఈ రెండు కేసులపైనా కేంద్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేయగలరా? అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.