ముద్ర‌గ‌డ‌కు ఏమైంది.. మ‌రో సారి క్రాంతి ఎంట్రీ!

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం(రెడ్డి) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌త కొన్నాళ్లు గా తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌న్న వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. అయితే.. పూర్తి వివ‌రాలు అప్ప‌ట్లో ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. తాజాగా ముద్ర‌గ‌డ‌.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై.. ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న కుమారుడు ముద్ర‌గ‌డ గిరి తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద న్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.

కాగా.. వైద్యులు తెలిపిన స‌మాచారం మేర‌కు ముద్రగడ గ‌త కొన్నాళ్లుగా కిడ్నీ ఇన్పెక్షన్, యూరిన్ ఇన్స్పెక్షన్ స‌హా ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధ ప‌డుతున్నారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా ఆయ‌న కిడ్నీ స‌మ‌స్య‌కు సంబంధించి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే.. అక‌స్మాత్తుగా శ‌నివారం రాత్రే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు.. 35కి పడిపోయాయి. దీంతో ఆయ‌న ఇంట్లోనే స్పృహ కోల్పోయారు. దీంతో ఆయ‌న‌ను స్థానికంగా ఆసుప‌త్రికి తీసుకువెళ్లినా.. మెరుగైన వైద్యం కోసం.. హైద‌రాబాద్‌కు వెళ్లాల‌ని సూచించారు.

కూతురు ఎంట్రీతో రివ‌ర్స్‌..

ముద్ర‌గడ ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు తెలుసుకున్న ఆయ‌న కుమార్తె, జ‌న‌సేన నాయ‌కురాలు.. ముద్ర‌గ‌డ క్రాంతి.. తండ్రిని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చారు. దీంతో ప‌రిస్థితి మొత్తం యూట‌ర్న్ తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌కు తీసుకువెళ్లాల‌ని అనుకున్న గిరి ఆయ‌న‌ను కాకినాడ‌కే ప‌రిమితం చేశారు. అంతేకా దు.. సోద‌రి క్రాంతిపై గిరి ప‌రుషంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. ఎవ‌రూ రావ‌డానికి వీల్లేద‌ని.. త‌న సోద రితో త‌న‌కు ఎలాంటి బంధుత్వం లేద‌ని ఆయ‌న తెగేసి చెప్పారు. తన అనుమతి లేనిదే తండ్రి దగ్గరికి ఎవరినీ పంపొద్దని కూడా ఆస్పత్రి వ‌ర్గాల‌కు గిరి తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో క్రాంతి తండ్రిని చూడ‌కుండా నే వెనుదిరిగారు.