వైసీపీ కేసుల స్టోరీ ఇంకా ముగియలేదా? ఆ పార్టీ నాయకులు చేసిన పాపాలు ఇంకా వెంటాడుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో కీలక నాయకులు, గతంలో జగన్ దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్టయి జైళ్లకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి వంతు వచ్చింది. ఈయనను కూడా అరెస్టు చేశారు. ఇక, ఇదే కేసులో మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కిళత్తూరు నారాయణ స్వామి వంతు కూడా వచ్చింది.
జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు. అయితే.. ఆయనను ముందు పెట్టి కథ మొత్తాన్నీ కీలక నాయకులు, అధికారులు నడిపించారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా .. కూడా ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి.. విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో నారాయణ స్వామి కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, గత నెలలో జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలను లెక్క చేయకుండా.. వైసీపీ నాయకులు వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. బారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించడం తో పాటు.. వివాదాలకు కూడా దారితీశారు. రప్పా రప్పా పోస్టర్లతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించా రు. ఆయా వ్యవహరాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. రెంటపాళ్లలో ఎంత మందిని సమీకరించారు? మీ పాత్ర ఏంటన్నది ఆమెనుంచి రాబట్టనున్నారు. ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఇదే కేసులో పోలీసులు ఆదివారం నోటీసులు ఇష్యూ చేశారు. సోమవారం విచారణకు రావాలని.. ఆదేశించారు. కార్యకర్తలను మోహరించడంతోపాటు.. పోలీసులపై దురుసుగా వ్యవహరించారన్న కేసులు ఆయనపై నమోదు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates