మిథున్ రెడ్డి అరెస్టుకే సిట్‌ మొగ్గు..

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వైసీపీ మ‌ద్యం కుంభకోణాన్ని విచారి స్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు అరెస్టు చేసేందుకు ఆగ‌మేఘాల‌పై నిర్ణ‌యాలు తీసు కుంటున్నారు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టుల్లో మిథున్ రెడ్డి దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో.. మ‌రో సారి ఆయ‌న త‌ప్పించుకోకుండా.. చూసేలా సిట్ అధికారులు స్థానిక కోర్టులో అరెస్టుపై వారెంట్ జారీ కోసం.. మెమో దాఖ‌లు చేశారు.

ప్ర‌స్తుతం మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న అరెస్టు కోసం కోర్టు నుంచి వారెంటు తీసుకోవా లి. దీనిని పార్ల‌మెంటు స్పీక‌ర్ ఓంబిర్లా కార్యాల‌యానికి పంపించి.. అక్క‌డ నుంచి కూడా అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఈ ప‌నుల‌న్నీ.. వాయువేగ మ‌నోవేగాల‌తో అధికారులు పూర్తి చేస్తున్నారు. వాస్త‌వానికి స్థానిక కోర్టులో అరెస్టు కోసం మెమో దాఖ‌లు చేసినా.. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను..త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని స్థానిక కోర్టు సిట్ అదికారుల‌ను కోరింది. దీంతో ఆయా తీర్పుల కాపీల‌ను అధికారులు సేక‌రించే ప‌నిలో ఉన్నారు.

ఇది పూర్త‌యితే.. స్థానిక కోర్టు మెమో ను ప‌రిశీలించి.. అరెస్టుకు వారెంటు జారీ చేసే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ఈ కేసులో 4వ నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డి.. శ‌నివారం.. సిట్ అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. ఢిల్లీ నుంచి ప్ర‌త్యేకంగా ఇత‌ర ఎంపీల‌తో క‌లిసి విజ‌య‌వాడ‌కు చేరుకున్న మిథున్ రెడ్డి సిట్ కార్యాల‌యానికి చేరుకున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయ‌న‌ను మ‌ధ్యాహ్నం 1 గంట‌ల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో మాస్ట‌ర్ మైండ్ స‌హా.. నిధులు దారి మ‌ళ్లించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో స్థానిక కోర్టు ఇచ్చే ఆదేశాల‌కు అనుగుణంగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవ‌కాశం ఉంది.