టీడీపీకి నాన్ లోకల్ లీడరే దిక్కా ?

తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ బలహీనంగా ఉంది. ఇందుకు ఒకరకంగా నాయకత్వమే కారణమని చెప్పాలి. ప్రతి ఎన్నికకు ఓ అభ్యర్ధిని కొత్తగా తెరపైకి తెస్తోంది. అదికూడా ప్రధానంగా నాన్ లోకల్ నేతలను తీసుకొచ్చి తిరుపతి పార్టీపై రుద్దుతోంది. తాజాగా జరిగింది కూడా ఇదే. సోమవారం తిరుపతి లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడుతు రాబోయే లోక్ సభ ఉపఎన్నికల్లో పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించారు.

ముందుగా నేతలతో అభ్యర్ధి విషయంలో చర్చలు జరపని చంద్రబాబు నేరుగా అభ్యర్ధిని ప్రకటించేయటంతో నేతలంతా ముందు ఆశ్చర్యపోయి తర్వాత షాక్ తిన్నారట. ఎందుకంటే మొదటి నుండి ఇక్కడ నాన్ లోకల్ నేతలే పోటీ చేస్తున్నారు. అందుకనే స్ధానికులకే టికెట్టు ఇవ్వాలంటూ నేతలు ఎప్పటి నుండో చంద్రబాబును అడుగుతున్నారు. అయినా చంద్రబాబు పనబాకను అభ్యర్ధిగా ప్రకటించేశారు.

2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున పనబాకే పోటీ చేశారు. వైసీపీ అభ్యర్ధి, దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు చేతిలో 2.28 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఈ ఏడాదిన్నరలో పనబాక మళ్ళీ తిరుపతికి వచ్చి నేతలను కలిసిందే లేదు. అసలామె పార్టీలో ఉంటారో లేదో కూడా అనుమానమే అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆమె తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పనబాకే కాదు అంతకుముందు 2014లో విజయవాడలో ఉండే వర్ల రామయ్యను తిరుపతిలో పోటీ చేయంచారు. ఓడిపోయిన తర్వాత ఆయన కూడా అడ్రస్ లేరు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 1984లో టీడీపీ తరపున చింతామోహన్ గెలవటమే చివరాఖరు. మళ్ళీ అప్పటి నుండి ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే మిగిలిన నాలుగు నియోజకవర్గాలు గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్ళూరుపేట నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. మామూలుగా ఎక్కడ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ ఉంటే అభ్యర్ధి కూడా అక్కడి వాళ్ళే ఉంటారు. కానీ తిరుపతిలో మాత్రం మొదటి నుండి రివర్సులో నడుస్తోంది. అభ్యర్ధి గెలిస్తే లోకల్-నాన్ లోకల్ అని చూడరు. ఓడిపోతుంటేనే ఈ సమస్యంతా వస్తుంది.