తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వేర్వేరుగా ఆయన రాజీనామా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా తన రాజకీయం ఎలా ఎక్కడ నుంచి ప్రారంభమైందన్న విషయాన్ని గజపతిరాజు వివరించారు. ఎన్టీఆర్ పిలుపుతో తాను ప్రజాసేవ చేసేందుకు .. రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ క్రమంలో అనేక పదవులు ఇచ్చారని తెలిపా రు.
ఇక, చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. తన రాజకీయ దశ-దిశ కూడా మారిపోయాయని అశోక్ గజపతిరాజు వివరించారు. కేంద్రంలో మంత్రిపదవి రావడానికి పూర్తిగా చంద్రబాబే కారణమని అశోక్ గజపతి రాజు తెలిపారు. అనేక సందర్భాల్లో అనేక పదవులు ఇప్పించడంతోపాటు.. రాజకీయంగా కూడా చంద్రబాబు తనను ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. గత ఎన్నికల్లో తన కుమార్తె అదితి విజయానికి కూడా చంద్రబాబు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు.. టిడిపి ద్వారా ప్రజాసేవ చేసేందుకు అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కాగా.. గోవా రాష్ట్రానికి అశోక్ గజపతి రాజు గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో పదవికి కూడా అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. గోవా గవర్నర్‌గా తనను నియమించేలా చేసిన చంద్రబాబుకు, నియమించిన ప్రధానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాను ఏపదవిలో ఉన్నా.. రాజ్యాంగానికి, న్యాయానికి కట్టుబడి వ్యవహరిస్తానని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. కాగా.. ఆయన ఈ నెల 25 తర్వాత.. గోవా గవర్నర్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. లేదా అవసరాన్ని బట్టి ఈలోగానే బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates