తెలంగాణ బీజేపీలో వర్గ పోరు ఎక్కువగా కనిపిస్తోంది. గ్రూపు రాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు, పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజా సింగ్ వెల్లడించారు. పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే… పార్టీ అదిష్టానం దీనిపై ఏమేరకు దృష్టి పెట్టిందో తెలియదు కానీ.. వర్గ పోరు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. నాయకులు ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రం రెడీ అవుతున్న సమయంలో అందరూ కలసి కట్టుగా ఉండాల్సిందిపోయి.. నియోజకవర్గాల వారీగా.. రాజకీయాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ నాయకులు ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి, బీజేపీ ఒకప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఇరువురు నాయకులు కూడా.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈటల దూకుడుకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మూడు రోజుల నుంచి జమ్మికుంట, కమలాపూర్‌లో.. రహస్యంగా ఈటల వర్గీయుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు టికెట్లు రావని, ఒకవేళ ఇదే జరిగితే.. పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించాలని వారు నిర్ణయించారు. దీనికి కారణం.. బండి సంజయేనని వారు చెబుతుండడం గమనార్హం. హుజూరాబాద్‌లో ఈటలకు మద్దతు ఉన్న విషయం తెలిసిందే. ఆయన వరుస విజయాలు కూడా దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో మాత్రమే ఆయన పరాజయం పాలైనా.. బలం.. పట్టు వంటివి నిలబెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఈటలను బలంగా ఎదరించేందుకు ఈటల వర్గీయులకు చెక్‌పెట్టే యోచనలో సంజయ్ ఉన్నారన్నది రాజకీయంగా తెరమీదికి వచ్చిన అంశం. దీంతో ఇక్కడ ఈటల వర్గానికి స్థానిక ఎన్నికల్లో టికెట్ దక్కకుండా చేసేలా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తమ జోలికి వస్తే.. బాగోదని.. ఈటల వర్గం చెబుతోంది. ఈటల కూడా.. సంజయ్ రాజకీయాలతో విభేదిస్తున్నారు. దీంతో ఆయన నేరుగా కేంద్రం పెద్దల దృష్టికి దీనిని తీసుకువెళ్ల ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates