ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రం ధ్వంసం చేశారు: చంద్ర‌బాబు

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ రాష్ట్రాన్ని ధ్వంసం చేసింద‌ని సీఎం చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి(జ‌గ‌న్‌) రాయ‌లసీమ‌కు చెందిన వ్య‌క్తే అయినా.. ఇక్క‌డి ప్రాజెక్టుల‌కు క‌నీసం 2 వేల కోట్ల రూపాయ‌లు కూడా కేటాయించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. గురువారం సాయంత్రం.. సీఎం చంద్ర‌బాబు హంద్రీనీవా ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. నీటిని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి ప‌నుల‌కు కూడా రాజ‌కీయాలు అంట‌గ‌ట్టార‌ని అన్నారు.

2019లో కూడా టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి ప‌నులు ముందుకు సాగేవ‌ని అన్నా రు. రాజ‌ధాని నిర్మాణం స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యేవ‌న్నారు. తాను రాజ‌కీయాలు చూడ‌కుండా అభివృ ద్ధికి పెద్ద‌పీట వేశాన‌ని చెప్పారు. రైతులు, ప్ర‌జ‌లు బాగుండాల‌నే తాను ఆలోచ‌న చేస్తాన‌న్నారు. ఎన్టీఆర్ ఒక ఆశ‌యంతో పాల‌న సాగించార‌న్న చంద్ర‌బాబు.. ఆయ‌న ఆశ‌యాన్ని తాము కూడా నెర‌వేరుస్తున్నామ ని చెప్పారు. వైసీపీ పాల‌న‌లో హంద్రీనీవా ప్రాజెక్టుకు కనీసం రూపాయి ఖర్చుపెట్టారా? అని ప్ర‌శ్నించారు.

రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామలం చేయాల‌న్న ఉద్దేశంతోనే నాడు ఎన్టీఆర్ హంద్రీనీవాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని చంద్ర‌బాబు చెప్పారు. తాము వ‌చ్చాక ఆయా ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్నామ‌న్నారు. టీడీపీ పాల‌న‌లోనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట ప్రాజెక్టులు పూర్తి చేసిన‌ట్టు తెలిపారు. నదుల అనుసంధానం జరగాలనేది త‌న జీవిత ఆశయమ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఈ నేప‌థ్యంలో బ‌న‌క చ‌ర్ల ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశామ‌ని.. ఇది పూర్తి చేస్తే.. సీమ మొత్తం రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని వెల్ల‌డించారు.

వైసీపీ పాల‌న ఒక దుర‌దృష్ట‌క‌ర అధ్యాయ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అన్నీ రాజ‌కీయాలే చేశార‌ని.. దీంతో ప్ర‌జ‌లు విసిగిపోయి.. 11 స్థానాల‌కే ప‌రిమితం చేశార‌ని అన్నారు. అయినా.. ఆ నాయ‌కుల్లో మార్పు రావ‌డం లేద‌న్నారు. ప్ర‌తి విష‌యాన్నీ.. రాజ‌కీయం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఆడ‌బిడ్డ‌ల‌ను కూడా రోడ్డుకు లాగుతున్నారంటూ.. ప‌రోక్షంగా ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించారు. త‌మ ప్రభుత్వం వీటిని చూస్తూ ఊరుకోద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఏడాది కాలంలో చేప‌ట్టిన ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.