ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు.. ఢిల్లీలో భేటీ అయ్యారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చర్చించారు. దీనిలో ఏపీ ప్రధానంగా కర్నూలు జిల్లాలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కానీ, తెలంగాణ మాత్రం గోదావరి బోర్డు సహా.. నీటి కేటాయింపులు.. తమ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. బనకచర్ల అంశంపై చర్చించేది లేదని తేల్చి చెప్పింది. అయితే.. కేంద్రం మాత్రం బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించింది. దీనిపై సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. ఈ క్రమంలో రెండు మూడు నిమిషాలు మాత్రమే ఈ సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగింది.
తెలంగాణ యధావిధిగా తన అభ్యంతరాలను పేర్కొంది. అసలు గోదావరిలో మిగులు జలాలు.. రెండు రాష్ట్రాలకూ వర్తిస్తాయని.. అలాంటప్పుడు ఏకపక్షంగా ఏపీ బనకచర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇది కడితే.. తమ ప్రాంతంలోని చాలా జిల్లాలు.. ఎడారి అవుతాయని పేర్కొంది. కానీ, ఏపీ మాత్రం అవసరమైతే.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీటిని పంచుకునేందుకు తాము సహకరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు, బనకచర్లపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. సోమవారం ఈ కమిటీకి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని నిర్ణయించారు.
ఇక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులు సహా.. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై టెలీ మెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరు ఎంత నీటిని వాడుతున్నారన్నది లెక్కలు తేలనుంది. గతంలో కేసీఆర్ దీనిని వ్యతిరేకించగా.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని తెలిసింది. ఇక, ఏపీకి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల, స్టోరేజీ అంశాలపై ఏపీ చర్చించింది. నాగార్జున సాగర్ వివాదం కూడా చర్చకు వచ్చింది. మొత్తంగా ఒక నిర్ణయం అంటూ.. ఏదీ తేలకుండానే.. ఈ సమావేశం ముగిసింది. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై పరిశీలన చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates