మ‌రో స‌ర్వే: 10 మంది ఔట్ అంట ..!

తాజాగా రాష్ట్రంలో మ‌రో స‌ర్వే రిపోర్టు వెలుగు చూసింది. 120 నియోజ‌క‌వ‌ర్గాలు, 20 మంది మ‌త్రుల‌పై చేపట్టిన స‌ర్వే.. తాజాగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. గ‌తంలో వ‌చ్చిన స‌ర్వేల‌కు.. ఇప్ప‌టి స‌ర్వేకు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. గ‌త స‌ర్వేలు కేవ‌లం రెండు మాసాల కింద‌టే వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు ఈ రెండు మాసాల వ్య‌వ‌ధిలో చేప‌ట్టిన స‌ర్వేలో.. మ‌రికొన్ని కీల‌క విష‌యాలు వెలుగు చూశాయి. ప్ర‌ధానంగా మంత్రుల విష‌యంపై చేప‌ట్టిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి.

గ‌త రెండు స‌ర్వేల్లో అంతా బాగున్న జాబితాలో 12 మంది మంత్రులు ఉన్నారు. ఆరెంజ్‌(ఓమాదిరి) జాబితాలో 10 మంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు వ‌చ్చిన జాబితాలో అస్స‌లేమీ బాగోలేదు.. అని పేర్కొన్న జాబితా లో 10 మంది ఉన్నార‌న్న‌ది స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అయితే.. వారి పేర్లు వెల్ల‌డించ‌క‌పోయినా.. వీరిపై మాత్రం ప్ర‌జ‌ల్లోనేకాదు.. పార్టీలోనూ తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. పార్టీ నాయ‌కులు కూడా .. ఈ ప‌దిమందిలో న‌లుగురిని ఇప్ప‌టికిప్పుడు మార్చేయాల‌ని కోరుకుంటున్న‌ట్టు స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

వీరిలో తూర్పుగోదావ‌రి, విశాఖ‌, క‌ర్నూలు, గుంటూరు జిల్లాలు కూడా ఉన్నాయ‌ని స‌ర్వే పేర్కొంది. అయితే .. పేర్లు మాత్రం బ‌హిరంగం చేయ‌లేదు. వీరి ప‌నితీరుపై చంద్ర‌బాబు కూడా అస‌హ‌నంతో ఉన్న‌మాట వాస్త‌వ‌మేన‌ని టీడీపీ సీనియ‌ర్లు కూడా వ్యాఖ్యానిస్తున్న‌ట్టు తెలిపింది. వీరిని ఇలానే కొన‌సాగిస్తే.. పార్టీ ప్ర‌భావం ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వం ప‌రంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. ప్ర‌జ‌ల‌లో సింప‌తీ పోయే ప్రమాదం ఉంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు మారుస్తారా? అనేది ప్ర‌శ్న‌.

ఇదిలావుంటే.. స‌ద‌రు 10 మంది మంత్రుల‌పై వ‌స్తున్న అభియోగాలు కూడా తీవ్రంగానే ఉన్నాయ‌ని స‌ర్వే పేర్కొంది. ఆదాయంపైనే ఎక్కువ మంది మంత్రులు దృష్టి పెట్టార‌ని తెలిపింది. నిరంత‌రం.. ఆదాయం పైనే దృష్టి పెట్ట‌డంతోపాటు.. దీనికి సంబంధించి కొంద‌రిని నియమించుకున్న‌ట్టుగా కూడా తెలిపింది. ప్ర‌జ‌ల‌కు చేరువ కాకుండా.. సొంత ప‌నులు చేసుకునే వారు వీరిలో న‌లుగురు ఉండ‌గా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండీ.. ఉన్నా.. లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు మ‌రోన‌లుగురు ఉన్నార‌ని తెలిపింది. ఇక‌, మ‌రో ఇద్ద‌రు.. అస‌లు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌ట్టు పేర్కొంది.