నిజం.. ఆ ఏపీ ఎమ్మెల్యేఏలు వైట్ పేప‌ర్సే ..!

రాష్ట్రంలో కొంద‌రు ఎమ్మెల్యేల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రికొంద‌రిపై అంత తీవ్రం కాక‌పోయినా.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లో వేలు పెడుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. తక్కువ సంఖ్య‌లో మాత్రం ఎమ్మెల్యేలు వైట్ పేప‌ర్లుగా ఉన్నార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే.. వీరిలోనూ కొంద‌రు ప్ర‌జ‌లకు చేరువ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయినా కూడా.. వివాదాల‌కు దూరంగా ఉంటున్నారు. అక్ర‌మాలు, ఇత‌ర వ్యాపారాల‌కు ఇంకా దూరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరంతా వైట్ పేప‌ర్సేన‌ని అంటున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా ఈ జాబితాలో ఉంది. ఆయ‌న‌కు వ్య‌వ‌సాయం ఉంది. అదేవిధంగా ఇత‌ర 2 ప‌రిశ్ర‌మ‌లు కూడా ఉన్నాయి. దీంతో ఆయ‌న ఇత‌ర వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డం లేదు. అయితే.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లేందుకు మాత్రం ఈయ‌న త‌ట‌ప‌టాయిస్తున్నార‌నే టాక్ ఉంది. ఇక‌, ఇదే జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్ర‌కాష్‌రెడ్డి అయితే.. వివాదాలకు క‌డుదూరంగా ఉంటున్నారు. ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ అవుతున్నారు.వారానికి నాలుగు రోజులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు.

కానీ.. కూట‌మి నాయ‌కుల‌తో స‌ఖ్య‌త.. బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించే అల‌వాటు ఒక్క‌టే ఆయ‌న‌కు మైన‌స్ అయింద‌ని అంటున్నారు. గుంటూరు తూర్పు నుంచి విజ‌యంద‌క్కించుకున్న టీడీపీ నేత కూడా.. వైట్ పేప‌ర్ జాబితాలో ఉన్నారు. ఆయ‌న కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. కూట‌మిలో మాత్రం అనుకున్నంత దూకుడు లేద‌న్న‌ది ఒక్క‌టే మైన‌స్ అయినా.. కూడా తూర్పు నియోజ‌క‌వర్గంలో మాత్రం మంచి మార్కులు వేయించుకుంటున్నారు.

టీడీపీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావు ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్న‌ట్టు తెలిసింది. ఈయ‌న కూడా వివాదాల‌కు దూరంగా ఉంటారు. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డ‌మే కాదు.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, సంచ‌నాల‌కు పెద్ద‌పీట వేయ‌రు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం త‌క్కువేనన్న మాట ఒక్క‌టే మైన‌స్‌. అయితే.. పార్టీ కార్య‌క్రమంలో బిజిగా ఉంటున్న నేప‌థ్యంలో ఇది సాధ్యం కావ‌డం లేదు. ఇక‌, నందిగామ మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా ఈ జాబితాలో 10వ ప్లేస్‌లో ఉన్నారు. నిరంతరం అందుబాటులో ఉంటున్న నాయ‌కురాలిగానే కాదు.. ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండే నాయ‌కురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు.