ఏపీ రైతుల‌కు పండ‌గే.. ఒకే సారి 20 వేలు

ఏపీ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భ‌రోసా నిధుల‌పై మంత్రి నారాయ‌ణ క్లారిటీ ఇచ్చేశారు. ఒకేసారి రైతుల‌కు 20 వేల రూపాయ‌ల‌ను అందిస్తామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే త‌దుప‌రి విడ‌త నిధుల‌తో క‌లిపి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ఇవ్వాల్సిన బ‌కాయిని కూడా క‌లిపి ఇస్తామ‌న్నారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ.20 వేల చొప్పున ప‌డ‌తాయ‌ని.. వారు ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు పోవ‌ద్దని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కొంద‌రు ఈ విష‌యంలో రైతులను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జ‌న‌సేన నాయ‌కుడు బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ తాడేపల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వ‌హించారు. మంత్రి నేరుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘డోర్ టూ డోర్’ వెళ్లి పింఛ‌న్లు, రేష‌న్‌, ఉచిత సిలిండ‌ర్లు, త‌ల్లికి వంద‌నం, ఫీజు రీయింబ‌ర్స్ మెంటు(ఇప్ప‌టికే ఇచ్చిన‌వి) వంటి వాటిపై ఆరా తీశారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి నారాయ‌ణ రైతుల‌కు సంబంధించిన విష‌యంపై స్పందించారు. రైతుల‌కు ధాన్యం తాలూకు ఇవ్వాల్సిన బ‌కాయిల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చెప్పారు. రైతు భ‌రోసా పై వైసీపీ నాయ‌కులు తెలిసీ తెలియ‌ని విష‌యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిపారు. వారి హ‌యాంలో ఎప్పుడు ఇచ్చారో గుర్తు చేసుకోవాల‌ని.. లేక‌పోతే.. ఆవివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందే పెట్టి ప‌రువు తీస్తామ‌ని హెచ్చ‌రించారు. త్వ‌ర‌లోనే రైతుల‌కు మేలు చేసేలా.. రూ.20 వేల‌ను ఇస్తామ‌ని మంత్రి తెలిపారు.

వైసీపీ నేత‌లు జైలుకెళ్లక త‌ప్ప‌ద‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల అక్రమాలు చోటు చేసుకున్నాయ‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంద‌న్నారు. అక్ర‌మాలు చేసిన వారిని వ‌దిలేస్తే.. ప్ర‌జా తీర్పున‌కు అర్ధం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. వారిని ఖ‌చ్చితంగా జైలుకు పంపిస్తామ‌ని నారాయ‌ణ తెలిపారు.