ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తాను స్వయంగా పుస్తకం రాయనున్నట్టు వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన విషయాన్ని బయట పెట్టారు. వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదని మీలో చాలా మంది బాధపడుతున్నారు. కానీ, చంద్రబాబులాగా నేను ప్రజలను మోసం చేయలేను. వారికి హామీలు ఇచ్చి.. తప్పలేను. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. విలువ ఏముంటుంది. గత ఎన్నిక ల్లో మీరు చూశారు. రాష్ట్రంలో మన పార్టీ ఘోరంగా దెబ్బతింది. అయినా.. మన దగ్గర మాత్రం ఎంత పోటీ ఉన్నా.. ప్రజలు నన్ను గెలిపించారు. దీనికి కారణం విలువలు, విశ్వసనీయతే. చంద్రబాబుకు ఇవి రెండూ లేవు.” అని పెద్దిరెడ్డి అన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు ఇన్నేళ్లు కూడా ప్రజలను మోసం చేస్తూనే అధికారంలోకి వచ్చారన్న పెద్ది రెడ్డి.. త్వరలోనే ఆయన మోసాలపై.. పుస్తకం రాస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు అది చేస్తా.. ఇది చేస్తా అని చెప్పిన చంద్రబాబు ఇన్నాళ్లలో ఒక్కటి కూడా చేయలేదన్నారు. అమ్మ ఒడి మన సార్(జగన్) తెచ్చారు. కానీ, దీనిని ఆయన కుమారుడే(నారా లోకేష్) తెచ్చాడని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది తప్పని తెలిసినా.. చంద్రబాబు రాజకీయాలు ఇలానే ఉంటాయన్నారు.
అందుకే చంద్రబాబు చేసిన తప్పులు.. చేస్తున్న తప్పులపై తాను పుస్తకం రాయాలని నిర్ణయించుకున్న ట్టు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును తీసుకు వస్తున్నట్టు చంద్రబాబు చెప్పారన్న ఆయన.. అయితే.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఇది తాను కోరుకుంటున్న డిమాండ్ కాదని.. గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీనేనని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కుప్పంలో చంద్రబాబు ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనను ఆయన ఫోన్‌లో చూపించారు. “కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేలా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తాం” అని చంద్రబాబు అన్నారని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates