ప్రభుత్వం-ఎన్నికల కమీషన్ మధ్య తాజా వివాదం

రాష్ట్రప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు మధ్య మళ్ళీ వివాదం తలెత్తింది. అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని కమీషన్ లాయర్ కు, ప్రభుత్వ లాయర్ కు మధ్య సుప్రింకోర్టులో పెద్ద వాగ్వాదమే జరిగింది. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత అభివృద్ది పనులకు ఎలక్షన్ కమీషన్ అనుమతి తీసుకోవాల్సిందే అంటూ సుప్రింకోర్టు కూడా స్పష్టం చేయటంతో ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. ప్రభుత్వం అడిగినపుడు ఎలక్షన్ కమీషన్ అనుమతులు ఇవ్వకపోతే అప్పుడు తమతో చెప్పండని సుప్రింకోర్టు ఆదేశింటమే విచిత్రంగా ఉంది.

ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటున్న పథకాలేవీ కొత్తవి కావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏ పథకాన్ని ఎప్పుడు అమల్లోకి తెస్తున్నారనే విషయంలో నిర్దిష్ట షెడ్యూల్ ను ప్రకటించారు. పథకాల అమలకు జగన్ కచ్చితంగా షెడ్యూల్ ను ఫాలో అవుతున్నారు. పనిలో పనిగా అదనంగా మరికొన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలు మొదలయ్యాయి. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను మధ్యలో ఆపేసింది కమీషన్.

విచిత్రమేమిటంటే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కోడ్ ను మాత్రం అలాగే కంటిన్యు చేశారు. అయితే ఈ విషయమై కోర్టులో కేసు నడిచినపుడు సుప్రింకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ను కమీషనర్ ఎత్తేశారు. మళ్ళీ ఎలక్షన్ తేదీలను ప్రకటించినపుడు కోడ్ ను అమల్లోకి తేవాలని సుప్రింకోర్టు ఆదేశించింది. దానిప్రకారం ఇపుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేనట్లే. ఇదే వాస్తవం అయితే మరి అభివృద్ధి పనులకు ఎలక్షన్ కమీషన్ అనుమతులు ఎందుకు తీసుకోవాలో ఎవరికీ అర్ధం కావటం లేదు.

కొత్త పథకాలేవైనా ప్రభుత్వం లాంచ్ చేస్తుంటే అనుమతులు తీసుకోవాలని చెప్పినా అర్ధముంది. అంతేకానీ ఆన్ గోయింగ్ పథకాలకు, ముందే షెడ్యూల్ ప్రకటించిన కార్యక్రమాలకు అనుమతులు ఎందుకు తీసుకోవాలన్నది ప్రభుత్వం వాదన. ఈ విషయాలు ఇలాగుంటే మళ్ళీ ఇపుడు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పెరుగుతున్న కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తోంది.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఏదో ఓ వివాదం లేకపోతే ఇటు ప్రభుత్వానికి కానీ అటు ఎలక్షన్ కమీషనర్ కు కానీ తోస్తున్నట్లు లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎలక్షన్ కమీషన్ వ్యవస్ధ రాజ్యాంగబద్దమైనదని చెబుతు తనిష్టం వచ్చినట్లు నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంతో మాట్లాడకుండానే నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకుని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో నిమ్మగడ్డ వ్యవహార శైలితో మండిపోతున్న ప్రభుత్వం ఆయన రిటైర్ అయ్యేంత వరకు మళ్ళీ ఎన్నికలను జరిపేందుకు లేదని భీష్మించుకుని కూర్చున్నది. ఏప్రిల్ లో నిమ్మగడ్డ రిటైర్ అయ్యేంతవరకు ఈ గొడవలు ఇలాగే ఉంటాయోమో.