బాబు య‌త్నం: అశోక‌గ‌జ‌ప‌తి రాజు ఇక‌, గ‌వ‌ర్న‌ర్‌!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు గ‌వ‌ర్న‌ర్ గిరీ ద‌క్కింది. ఆయ‌న‌ను గోవా(అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం)కు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ.. రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము ఉత్త‌ర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల‌లో ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వ‌చ్చారు. ఈయ‌న సోద‌రుడు ఆనంద గ‌జ‌ప‌తిరాజు కూడా కొన్నాళ్లు టీడీపీ లో ప‌నిచేశారు.

విజ‌య‌న‌గ‌ర్ పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల నుంచి ప‌లు ప‌ర్యాయాలు అశోక్ గ‌జ‌ప‌తిరాజు విజ‌యం సాధించారు. వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కించుకున్న ఉత్త‌రాంధ్ర నాయ‌కుడిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకు న్నారు. 2014-19 మ‌ధ్య కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారులో పౌర విమానయాన మంత్రిగా కూడా గ‌జ‌ప‌తి రాజు సేవ‌లు అందించారు. ఆయ‌న హ‌యాంలోనే విజ‌య‌వాడ గ‌న్న‌వ‌రం పోర్టుకు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో రూపుదిద్దుకునే భాగ్యం క‌లిగింది.

అలానే విజ‌య‌న‌గంలోనూ.. భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కూడా.. గ‌జ‌ప‌తి రాజు హ‌యాంలో నే బీజం ప‌డింది. పౌర విమాన‌యాన రంగాన్ని ప్రైవేటుకు చేరువ చేయ‌డంతోపాటు.. పార‌ద‌ర్శ‌కంగా కూడా తీర్చిదిద్దారు. దీనికి ముందు రాష్ట్రంలోనూ ఆయ‌న మంత్రిగా సేవ‌లు అందించారు. సీఎం చంద్ర‌బాబుతో ఉన్న అనుబంధం.. రాజ‌కీయ సీనియార్టీ వంటివి క‌లిసివ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు తాజాగా చంద్ర‌బాబు జోక్యంతో గ‌వ‌ర్న‌ర్ పోస్టుకు నామినేట్ అయ్యారు.

అశోక్‌గజపతిరాజుతోపాటు.. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా‌లను నియ‌మించారు. వీరు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఐదేళ్ల వ‌రకు ఆయా ప‌ద‌వుల్లో ఉంటారు. లేదా.. కేంద్రం మ‌ధ్య‌లోనే వారిని వెన‌క్కి ర‌ప్పించ‌నూ వ‌చ్చు. కాగా.. కూట‌మిలో ఉన్న టీడీపీని మ‌చ్చిక చేసుకునేలా ఒక గ‌వ‌ర్న‌ర్ పోస్టును కేటాయించ‌డంపై టీడీపీ నాయ‌కులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.