గుడివాడలో హై టెన్షన్..వైసీపీ వర్సెస్ టీడీపీ

గుడివాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ లో వైసీపీ నేతల సమావేశం జరిగింది. మరోపక్క గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేయగా…అందుకు ప్రతిగా గుడివాడ గడ్డ రామన్న అడ్డా అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టారు.

వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు చింపివేయడంతో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నాగవరప్పాడు సెంటర్ నుంచి కే కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించగా…అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణల నేపథ్యంలోనే కే కన్వెన్షన్ వైపు వెళ్తున్న వైసీపీ నేత, జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారిక కారు ధ్వంసమైంది.

ఆ క్రమంలోనే కే కన్వెన్షన్ లోకి వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, ఒక్కసారిగా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో వారిని తొలగించేందుకు యత్నిస్తున్నారు.

అంతకుముందు, గుడివాడలో కొడాలి నానికి ఆయన చేసిన సవాల్ ను గుర్తు చేస్తూ గుడివాడ నడిబొడ్డున ఫ్లెక్సీ వెలిసింది. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తానని ఎన్నికలకు ముందు ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ అంటూ పోస్టర్ ప్రత్యక్షమైంది. మరోవైపు, అనారోగ్య కారణాలతో వైసీపీ నేతల సమావేశానికి కొడాలి నాని దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ వన్ టౌన్ పీఎస్ లో సంతకం చేసిన అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారని తెలుస్తోంది.