మోడీకి ఎర్త్ త‌ప్ప‌దా.. ఆర్ ఎస్ ఎస్ దూకుడు!

గుజ‌రాత్‌కు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా, దేశానికి మూడు సార్లు ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌రేంద్ర మోడీకి.. ఈ ఏడాది సెప్టెంబ‌రులో ఆ ప‌ద‌విని వ‌దులుకోక త‌ప్ప‌దా? వ‌య‌సు రీత్యా ఏర్ప‌డిన నిబంధ‌న‌ల‌ను ఆయ‌న‌కు మిన‌హాయింపు ఇచ్చే అవ కాశం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నాయి బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌) వ‌ర్గాలు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్‌భ‌గ‌వ‌త్‌.. ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని తెలుస్తోంది. రెండు రోజుల కింద‌ట కూడా.. ఆయ‌న వ‌య సు ఆధారంగా చేసిన వ్యాఖ్య‌లు.. బీజేపీని ఇర‌కాటంలోకి నెట్టాయి.

“ఏ స్థాయి నాయ‌కుడైనా కూడా.. నిబంధ‌న‌లు పాటించాలి. లేక‌పోతే.. నిబంధ‌న‌లు ఎందుకు?” అని మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఒకింత గ‌ట్టిగానే చెప్పారు. ఆ నిబంధ‌న కూడా వ‌య‌సును గురించే ఆయ‌న ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. “75 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చాక‌.. ఎవ‌రైనా ప‌ద‌వులు త్యాగం చేయాల్సిందే. కొత్త‌వారికి.. అవ‌కాశం క‌ల్పించాల్సిందే.” అని తెగేసి చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ద‌వీ వ్య‌వ‌హారంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ఈ ఏడాది సెప్టెంబ‌రులో ఆయ‌న 75వ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌ధాని ప‌ద‌విని వ‌దులు కోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.

ఇదేస‌మ‌యంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌గా ఉన్న మోహ‌న్‌భ‌గ‌వ‌త్ కూడా అదేనెల‌లో ప‌ద‌వీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబ‌రు నాటికి ఆయ‌న మోడీ కంటే కూడా.. ముందే 75వ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌నున్నారు. దీంతో ముందు ఆయ‌న రిజై న్ చేసి..కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హారం మ‌రింత బిగుసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. కానీ.. ఇలా జ‌రుగుతుందా? బ‌ల‌మైన వ్య‌క్తిగా.. బీజేపీని మూడుసార్లు వ‌రుస‌గా అధికారంలోకి తెచ్చిన నాయ‌కుడిగా మోడీకి పేరుంది.

అంతేకాదు.. కాంగ్రెస్ స్థాయిని చాలా వ‌ర‌కు త‌గ్గించి.. ప్ర‌పంచ దేశాల‌కు కూడా ‘విశ్వ‌గురు’గా పేరు తెచ్చుకున్న మోడీ.. ఇప్పటి కిప్పుడు అధికారం నుంచి దిగితే.. అది ఎంత వ‌ర‌కు మేలు చేస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల‌తోపాటు.. ల‌క్ష్యాల‌ను కూడా ఒక‌దాని వెంట ఒక‌టి సాధిస్తున్న ప్ర‌ధానిగా కూడా మోడీ పేరు తెచ్చుకున్నారు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, వ‌న్ నేష‌న్‌-ఒన ఎల‌క్ష‌న్‌, ఎన్ ఆర్సీ, పౌర‌స‌త్వం.. ఇలా.. అనేక ఆర్ ఎస్ ఎస్ ల‌క్ష్యాల‌ను సాధించిన ఘ‌న‌త మోడీ ఖాతాలోనే ప‌డింది.ఇంకా సాధించాల్సిన‌వి చాలానే ఉన్నాయి. ముఖ్యంగాపీవోకే(పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌)ను భార‌త్‌లో క‌ల‌ప‌డం కీల‌కం. మ‌రి ఇవ‌న్నీ ఉండ‌గా.. మోడీ రిటైరైతే.. ఆర్ ఎస్ ఎస్ ల‌క్ష్యాలు తీరేనా? అనేది.. బీజేపీ నాయ‌కుల ప్ర‌శ్న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.