వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై ఆ పార్టీలోని కీలక నాయకులు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఓడిపోయిన ఏడాది దాటిన తర్వాత కూడా.. వారు జగన్ పై తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యులు? అనే విషయం పై పార్టీ అధినేత జగన్ ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. ఆయనకు తెలిసే.. మౌనంగా ఉంటున్నారో.. లేక, నిజంగానే తెలియదో కానీ.. పార్టీ నాయకులు మాత్రం తరచుగా ఈ విషయం పై వ్యాఖ్యలు చేస్తున్నారు..
గతంలో అనంత వెంకట్రామిరెడ్డి, అప్పటి స్పీకర్ సీతారామ్, జగన్‌తో ఎంతో ఆత్మీయంగా ఉండే మేకపాటి ఫ్యామిలీ.. కూడా ఎన్నికల్లో ఓటమికి జగన్ తమ మాట వినిపించుకోకపోవడమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వలంటీర్ వ్యవస్థ కారణంగానే తాము ఓడిపోయామన్నారు. దీనివల్ల నాయకులకు-ప్రజలకు మధ్య సంబంధాలు కట్ అయ్యాయని వ్యాఖ్యలు చేశారు. ఇది తమకు ఎన్నికల్లో పెద్ద మైనస్ అయిందన్నారు. ఇక, ఇప్పుడు మరో కీలక నాయకుడు, వైసీపీలో మంచి పేరున్న నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే కూడా సేమ్ టు సేమ్ ఈ వ్యాఖ్యలే చేశారు.
మరో అడుగు ముందుకు వేసి.. ఎన్నికలకు ముందు.. తాను జగన్‌ను కలిశానని వలంటీర్ వ్యవస్థ మంచిది కాదని చెప్పానని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో ప్రముఖ డాక్టర్ అయిన.. గోపిరెడ్డి.. వైసీపీలో వరుస విజయాలు సాధించారు. జగన్‌కు వ్యక్తిగత వైద్యులుగా ఉన్న కొందరిలో ఈయన కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. తాను ఇదే చెప్పానన్నారు.
ఇక, మరో చిత్రమైన మాట కూడా గోపిరెడ్డి నుంచి వినిపించింది. తాము ఎన్ని చెప్పినా.. జగన్ వినిపించుకుని ఉంటే.. ఓటమి వచ్చేది కాదన్నారు. కూటమి ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చేయకుండా.. పార్టీ అంతర్గత రాజకీయాలపైనే గోపిరెడ్డి స్పందించారు. గతంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా.. ఇలానే వ్యాఖ్యానించారు. వలంటీర్ల వల్ల ఓటమిని కొని తెచ్చుకున్నామన్నారు. అయితే.. ఒకరిద్దరు మాత్రమే సున్నితంగా జగన్‌ను తప్పుబట్టారు. అందుకే ఇప్పుడు వైసీపీ వలంటీర్లకు దూరంగా ఉంటోంది. మరి వచ్చే ఎన్నికల సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates