ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాలు, విభేదాలు ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. పైగా.. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్యే కొండా మురళీధర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. తాజాగా మాజీ మంత్రి కడియం శ్రీహరి సహా.. వరంగల్ నుంచి కీలక నాయకులు గాంధీ భవన్‌కు పోటెత్తారు. కొండాపై ఫిర్యాదుల పరంపరను పార్టీ ఇంచార్జి నటరాజన్ ముందు ఉంచారు. ఆయన వల్ల పార్టీలో సఖ్యత లేకుండా పోయిందన్నారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో తాము పనిచేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని.. కొండా హవా ముందు.. తమను చిన్న చూపు చూస్తున్నారని కూడా వారు వెల్లడించారు. కొండా ఉంటే.. తాను రాజకీయాలు చేయలేనని కడియం కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. కొండా దంపతులు ఇద్దరూ.. కూడా తమను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇక, ఇతర నేతలు కూడా బలంగానే కొండా కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిలో నాయిని ఫ్యామిలీ నుంచి రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి బలమైన నాయకులు ఉన్నారు.
అంతేకాదు.. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అయితే.. తక్షణమే తమకు విముక్తి కల్పించాలని కోరడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ఎర్రబెల్లి స్వర్ణ సహా.. సీనియర్ నేత వెంకట్రామిరెడ్డి సైతం.. కొండా ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కొండా దంపతుల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. తమను గెలిపించామని.. ఈ రోజు తాము గెలుపొందడం వెనుక కొండా దంపతులే ఉన్నారన్న వాదనలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
ఇది సరికాదని వరంగల్ నాయకులు గంపగుత్తగా వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు కొండా దంపతులు ఒకవైపు.. ఇతర ఓరుగల్లు కాంగ్రెస్ నాయకులు మరో వైపు నిలిచినట్టు అయింది. అయితే.. రాజకీయంగా బలంగా ఉన్న కొండా వర్గాన్ని పార్టీ దూరం చేసుకునే పరిస్థితిలో లేదు. పైగా.. ఇదే జరిగితే.. బీఆర్ఎస్‌కు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కాంగ్రెస్ సీనియర్లు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ముందు.. కొండా వ్యవహారం పెను దుమారంగా మారిందనే చెప్పాలి. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates