జగన్ జనంలోకి వస్తున్నారు. కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రప్పా-రప్పా డైలాగులు పేలుస్తున్నారు. పోలీసులను కూడా హెచ్చరిస్తున్నారు. అది పొదిలైనా.. రెంటపాళ్లైనా.. తాజాగా బంగారు పాళ్యమైనా. జగన్ దూకుడు ఎక్కువగానే ఉంది. జన సమీకరణ కూడా అలానే ఉంది. వీటిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నా.. ఓ పట్టాన సాధ్యం కావడంలేదు. అంతా అయిపోయాక.. సర్కారు కేసులు పెట్టి మరోరూపంలో బద్నాం అవుతోంది. ఈ క్రమంలో అసలు జగన్ బయటకు వచ్చేందుకు అవకాశం ఇస్తోందెవరు? అనేది కీలక చర్చ.
ప్రస్తుతం యూట్యూబ్ చానెళ్లలోనే కాదు.. ప్రధాన మీడియాలోనూ ఈ తరహా చర్చ జోరుగా సాగుతోంది. జగన్ బయటకు వచ్చేందుకు అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? అనేదే చర్చ. ఈ విషయంలో అన్ని వేళ్లూ.. కూటమి ప్రభుత్వంవైపే చూపిస్తున్నాయి. ఒక్క రెంటపాళ్ల వ్యవహారం పక్కన పెడితే.. పొదిలి, బంగారు పాళ్యం పర్యటనలకు అవకాశం కల్పించింది.. సర్కారేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొదిలి పర్యటనలో మహిళలపైరాళ్లు, చెప్పులు విసిరారు.
బంగారు పాళ్యం పర్యటనలో మామిడి కాయలు రోడ్డుపై పారబోసి.. హల్చల్ చేశారు. దీనివల్ల వైసీపీ నష్ట పోయిన దానికంటే.. కూడా సర్కారుపై వచ్చిన విమర్శలే ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు చెబుతున్న అసలు కారణాలు.. సర్కారు దగ్గరే ఉన్నాయని అంటున్నారు. రెంటపాళ్ల పర్యటన పూర్తిగా వైసీపీకి చెందిన కార్యక్రమం. తమ పార్టీ కార్యకర్త ఏడాది కిందట చేసుకున్న ఆత్మహత్య నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు.
ఇక, పొదిలి విషయానికి వస్తే.. పొగాకు రైతులకు మద్దతు ధరలు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించేందుకు జగన్ వెళ్లారు. చిత్రం ఏంటంటే.. జగన్ వెళ్లాక.. సర్కారుపై విమర్శలు చేశాక.. జరగాల్సిన రాద్ధాంతం జరిగిపోయాక.. ప్రభుత్వం రియాక్ట్ అయింది. కేంద్రానికి లేఖలు రాసింది. కేబినెట్‌లో చర్చించింది. ఆదుకుంటామని ప్రకటించింది. అలా కాకుండా.. ముందుగానే ఈ పనులు చేసి ఉంటే.. జగన్‌కు అవకాశం దక్కేది కాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
తాజాగా బంగారు పాళ్యం ఘటనలోనూ.. ఇదే కనిపించింది. తోతాపురి మామిడి కాయలకు కనీసం ధర కూడా దక్కడం లేదని రైతులు రెండు మాసాలుగా ఉద్యమించారు. రోడ్ల వెంబడి కిలో మీటర్ల లెక్కన ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కిలో రూ.2, 1 కే కొంటున్నారని గగ్గోలు పెట్టారు. అప్పట్లో సర్కారు పెద్దగా పట్టించుకోలే దు. కానీ.. జగన్ తన పర్యటన ప్రకటించాక.. మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లారు. మామిడి రైతులను ఆదుకోవాలన్నారు.
ఇక, జగన్ పర్యటించిన రోజే.. కేబినెట్ 260 కోట్ల రూపాయలను తోతాపురి రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇవేవో.. ముందుగానే నిర్ణయించి ఉంటే.. అసలు జగన్ బయటకు వచ్చే అవకాశం కూడా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంటే.. దీనిని బట్టి.. జగన్‌కు ఎవరు అవకాశం ఇస్తున్నారన్నది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates