చంద్ర‌బాబు మాస్టారికి అరుదైన గౌర‌వం.. ఏంటో తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా స్కూల్ మాస్టారి అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. దాదాపు 45 నిమిషాల‌కుపైగా ఆయ‌న 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సైన్సుపాఠం బోధించారు. వారిని ప్ర‌శ్న‌లు అడుగుతూ.. స‌మాధానాలు రాబ‌డుతూ.. పాఠ్య పుస్త‌కాన్ని ఫాలో అవుతూ.. విద్యార్థులకు ‘వ‌న‌రులు’ అనే పాఠాన్ని బోధించారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన ‘మెగా పేరెంట్స్‌-టీచ‌ర్స్’ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు ఇలా స్కూల్ మాస్ట‌ర్‌గా మారిపోయారు.

అక్క‌డే మధ్యాహ్న భోజ‌నం కూడా చేశారు. అనంత‌రం.. త‌ల్లిదండ్రుల‌తో కూడా.. పిచ్చాపాటి మాట్లాడారు. విద్యార్థుల స్థాయిని తెలుసుకున్నారు. ఇలా.. మొత్తం కార్య‌క్ర‌మంలో గంట‌న్న‌రకు పైగా సాగింది. సాధారణంగా చంద్ర‌బాబు కార్య‌క్ర‌మం అంటే.. మీడియా లైవ్ ప్ర‌సారం చేస్తుంది. దీంతో చంద్ర‌బాబు చెప్పిన పాఠాలను కేవ‌లం ఆ స్కూలు విద్యార్థులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌హా బాబు అభిమానులు కూడా ఆల‌కించడం విశేషం.

అంతేకాదు.. లైవ్ త‌ర్వాత‌.. ఈ వీడియోల‌ను యూట్యూబ్‌లోనూ వీక్షించిన వారు ఉన్నారు. ఎన్నారైలు కూడా.. వీటిని ఆస‌క్తిగా విన్నారు. చంద్ర‌బాబు గ‌తంలోనూ ఒక‌టి రెండు సార్లు స్కూళ్ల‌ను సంద‌ర్శించి.. విద్యార్థుల‌తో మ‌మేకం అయినా.. ఇలా టెక్స్ట్ పుస్త‌కాన్ని ప‌ట్టుకుని ఆయ‌న పాఠాలు చెప్ప‌డం.. దాదాపు 45 నిమిషాల పాటు ఆయ‌న ఏక‌బిగిగా నిల‌బ‌డి.. పిల్ల‌ల‌తో ఇంట‌రాక్ట్ కావ‌డం వంటివి జ‌ర‌గ‌లేదు. దీంతో తొలిసారి చంద్ర‌బాబు ఇలా పూర్తిస్థాయిలో స్కూల్ టీచ‌ర్‌గా మారిపోవ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఆయ‌న‌ను గ‌మ‌నించారు.

దీంతో లైవ్‌లోనే కాకుండా.. యూట్యూబ్‌లోనూ ఆయ‌న పాఠాలను 2 ల‌క్ష‌ల మందికిపైగా విన‌డం ఒక రికార్డ‌నే చెబుతున్నారు.. పార్టీ నాయ‌కులు. ఇలా.. గ‌తంలో ఏ సీఎం చేయ‌క‌పోవ‌డం.. చంద్ర‌బాబు ఎంతో ఓర్పు, నేర్ప‌ల‌తో విద్యార్థుల‌కు పాఠాలు నేర్ప‌డం వంటివి ఆస‌క్తిగా మారాయ‌ని అంటున్నారు. ఇదీ.. చంద్ర‌బాబు మాస్టారికి గురుపౌర్ణ‌మినాడు ద‌క్కిన అరుదైన గౌర‌వ‌మనే చెప్పాలి.