ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌.. ఢిల్లీకి బాబు!

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన పలు అనుమతులు, నిధుల విషయంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఈనెల 14న ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. కానీ ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారని ప్రచారం జరిగింది. దీనికి ముఖ్య మంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనే ప్రధాన కారణం. ఓ సందర్భంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు.

అయితే అప్పట్లో ఆయన ఎమ్మెల్సీ కాకపోవడంతో ఎమ్మెల్సీ అయ్యే వరకు వేచి చూస్తారని అందరూ అనుకున్నారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయి మూడు నెలలు అయింది. అయినప్పటికీ మంత్రివర్గంలో ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం మరో ఇద్దరు వ‌ర‌కు మంత్రులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి బిజెపి నాయకులు అదేవిధంగా కేంద్రంలోని పెద్దలతో మంత్రివర్గ విస్తరణ పై చర్చించనున్నట్టు టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రంలో బిజెపి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండడం, కూటమి ప్రభుత్వానికి తాము బలమైన మద్దతుగా నిలబడినా .. తమకు కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పదవులు గాని దక్కక పోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 2014 -19 మధ్య కూడా బిజెపి టిడిపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో బీజేపీకి చెందిన ఇద్దరికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు జనసేన కూడా తోడవడంతో కేవలం ఒక పదవికే బిజెపి పరిమితం అయింది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బిజెపి నాయకులు తరచుగా తమకు అన్యాయం జరుగుతోందని, ఐదు శాతం కాదు తమకు 20 శాతం వాటా కావాలని క్షేత్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్ నాయకులైన విష్ణు కుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి వంటి వారు దీనిని బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో మంత్రిని తీసుకునే అవకాశం కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక జనసేన నుంచి నాగబాబు బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న టీడీపీ మంత్రులలో వివాదాస్పదులైన ఒక మంత్రిని తొలగించి ఆ స్థానాన్ని కామినేని శ్రీనివాసరావుకు ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్తున్నారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టు విషయానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకునే దిశగా చంద్రబాబు తన ప్రయత్నాన్ని ముమ్మరం చేసేందుకు ఈ పర్యటన దోహద పడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఆ విషయంపై కూడా చంద్రబాబు చర్చించనున్నారని సమాచారం.