రౌడీ షీట్లే: వైసీపీకి ఎస్పీ ఘాటు హెచ్చ‌రిక‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. బుధ‌వారం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యా రు. ఈ జిల్లాలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ను ఆయ‌న సంద‌ర్శించ‌నున్నారు. తోతాపురి మామిడి కాయ‌ల రైతులు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను ఆయ‌న విన‌నున్నారు. వారికి గిట్టుబాట ధ‌ర క‌ల్పించ‌క‌పోవ డంపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌నున్న‌రు. అదేవిధంగా రైతుల‌కు సంబంధించి స‌మ‌స్య‌ల‌ను కూడా విన‌నున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ప్లాన్ చేసింది.

ఈ ప‌ర్య‌ట‌న బాధ్య‌త‌ల‌ను చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారు. దీంతో వేలాది మంది కార్య‌క‌ర్త‌ల‌ని త‌ర‌లించి.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు గ‌త నాలుగు రోజుల నుంచిప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌పై జిల్లా ఎస్పీ మ‌ణికంఠ ఇప్ప‌టికే చాలా ఆంక్ష‌లు విధించారు. జ‌గ‌న్ ప్ర‌యాణించే హెలికాప్ట‌ర్ దిగే.. హెలీ ప్యాడ్ వ‌ద్ద‌కు కేవ‌లం 30 మందిని మాత్ర‌మే అనుమ‌తించారు.

ఇక‌, అక్క‌డ నుంచి జ‌గ‌న్ చేసే ప‌ర్య‌ట‌న‌లో 500 మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ర్యాలీల‌కు, బ‌హిరంగ స‌భ‌ల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశా రు. ఇదిలావుంటే.. మ‌రోవైపు వైసీపీ ఈ ఆంక్ష‌ల‌ను తోసిపుచ్చి.. పెద్ద ఎత్తున జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో కార్య‌క‌ర్త ల‌ను స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిపై మ‌రోసారి స్పందించిన ఎస్పీ.. వైసీపీకి ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

త‌మ ఆంక్ష‌ల‌ను కాద‌ని.. వైసీపీ ర్యాలీలు నిర్వ‌హిస్తే.. దీనిని నిర్వ‌హించిన వారిని త‌క్ష‌ణ‌మే అరెస్టు చేస్తా మ‌ని.. మిగిలిన‌కార్య‌క్ర‌మానికి ఇచ్చిన అనుమ‌తులు కూడా ర‌ద్దు చేస్తామ‌ని ఎస్పీ చెప్పారు. అంతేకాదు.. 500 మంది క‌న్నా ఒక్క‌రు ఎక్కువ‌గా వ‌చ్చినా.. అంద‌రిపైనా రౌడీ షీట్లు తెరుస్తామ‌ని తేల్చి చెప్పారు. దీంతో వైసీపీకార్య‌క‌ర్త‌లు ఇప్పుడు వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్టు తెలిసింది.

మ‌రోవైపు.. కార్య‌క్ర‌మానికి కొన్ని గంట‌ల ముందు ఎస్పీ చేసిన ప్ర‌క‌ట‌న‌తో వైసీపీలోనూ టెన్ష‌న్ నెల‌కొంది. దీనిపై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అనుకున్నా.. కోర్టు స‌మ‌యం ముగిసిన త‌ర్వాత‌.. మంగ‌ళ‌వారం ఎస్పీ చేసిన ప్ర‌క‌ట‌న‌తో వైసీపీ నాయ‌కులు చిర్రుబుర్రులాడుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.