వైసీపీ ఒక విజ‌యం.. మ‌రిన్ని ప‌రాజ‌యాలు ..!

ఏపీ ప్రతిపక్షంగా ఉన్న వైసిపి ఒక విజయం మరిన్ని పరాజయాలు అన్న వాదనను మూటకట్టుకుంటోంది. 2012తో ప్రారంభమైన వైసీపీ రాజకీయాలు… 2019లో అధికారంలోకి వచ్చేవరకు ఒక విధంగా ఉంటే, అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న‌ నిర్ణయాలు.. మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదంగానే మారుతున్నాయి. ఒక పార్టీని నడిపించాలన్నా.. పార్టీని విజయపథంలో తీసుకువచ్చి అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధినేతగా జగన్ చేయాల్సిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ తరహాలో ఆయన ప్రభావితం చేయలేకపోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకప్పుడు వైసిపి అంటే భారీ మద్దతు, భారీ ఎత్తున సానుభూతి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, నగరాలు కూడా కనిపించా యి. ప్రతి ఇంట్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో లాగే తన ఫోటో కూడా పెట్టుకోవాల‌నే విధంగా పాలన చేస్తానని చెప్పిన జగన్ ఆ తర్వాత ఆ విషయంలో గాడి తప్పడం అనేది వాస్తవం. ఇది గత ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. 11 స్థానాలకు పరిమితమైన తర్వాత పార్టీ పరంగా తీసుకోవలసినటువంటి అనేక నిర్ణయాల విషయంలో ఇంకా తాత్సారం చేయడం, అదేవిధంగా వేస్తున్న అడుగులు కూడా తడబడుతుండడంతో వైసిపి అనేక పరాజ‌యాలను మూటగట్టుకుంటోంద‌నే చెప్పాలి.

ఉదాహరణకు ఎన్నికల అయిన ఏడాది తర్వాత చేపట్టిన పొదిలి పర్యటన వివాదమైంది. వాస్తవానికి ఇక్కడ పొగాకు రైతులను పరామర్శించడం ద్వారా ముఖ్యంగా సానుభూతి దక్కించుకుందామని చూశారు. కానీ, అమరావతి మహిళల ఆందోళన పై రాళ్లు చెప్పులు విసిరిన కారణంగా ఇది పరాజ‌య‌మైంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా రెంటపాళ్లలో ప్రకటించినప్పుడు కూడా పార్టీ కార్యకర్త సింగయ్య మృతి వైసిపికి శాపంగా మారింది. ఇలా జగన్ చేస్తున్న పర్యటనలు ప‌రాజ‌యం కావడం పార్టీ పరంగా కూడా నాయకులు దూకుడుగా లేకపోవడం వంటివి ఏడాది కాలంలో పార్టీ పుంజుకునేలా చేయలేకపోయాయి.

ఇక ఐదేళ్ల పాలనకు సంబంధించి తన ఫోటోను ప్రతి ఇంట్లోనూ పెట్టుకుంటారని జగన్ అనుకున్నా ఆయన ఫోటో ఉన్న పాస్ పుస్తకాలను, రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. తద్వారా జగన్ పేరు ఇప్పుడు ఏ ఇంట్లో కూడా వినిపించే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, చేస్తున్న సంక్షేమం వంటివి కూడా ప్రజలను ఆకర్షితులను చేస్తున్నాయి. ఎలా చూసుకున్న 2019 విజయం తర్వాత దాదాపు అన్ని పరాజ‌యాలే వైసిపి ని వెంటాడుతున్నాయని చెప్పాలి.

కీల‌క నాయకులు పార్టీని వదిలేయడంతో పాటు పార్టీకి సమస్తా గతంగా కూడా కార్యకర్తల మద్దతు కనిపించడం లేదు. ముందుగా ఈ పరాజ‌యాలను జయించి ముందుకు సాగకపోతే పార్టీకే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. మరి దీనినే ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎలా ముందుకు సాగుతారు? అనేది చూడాలి.