జ‌మిలికి గ్రీన్ సిగ్న‌ల్‌? అన్ని లెక్క‌లూ కుదిరాయి!

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మం అయింది. దీనిపై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. మాజీ రాష్ట్ర‌ప‌తి కోవింద్ నేతృత్వంలో వేసిన అత్యున్న‌త స్థాయి క‌మిటీ దీనిపై నివేదిక‌ను కూడా కేంద్రానికి ఇచ్చింది. ఆ త‌ర్వాత‌.. రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించారు. అయితే.. కొన్ని రాష్ట్రాలు ఓకే చెప్పాయి. మ‌రికొన్ని ఇంకా పెండింగులోనే పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రాలు జ‌మిలికి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఇంత‌లోనే కేంద్రంపై కొంద‌రు న్యాయ‌వాదులు ప్ర‌శ్న‌లు సంధించారు.

ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా.. ఎన్నిక‌ల సంఘం ఏమేర‌కు ప‌నిచేస్తుంద‌ని వారు సందేహం వ్య‌క్తం చేశారు. అదేవిధంగా జ‌మిలి నిర్వ‌హ‌ణ‌తో ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ని.. ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఆదా పెరుగుతుంద‌న్న వాద‌న‌ను కూడా వారు కొట్టేశారు. ఇక‌, ఒకేద‌ఫా ఎన్నిక‌లు నిర్వ‌హ‌ణ ద్వారా.. అవినీతి పెరుగుతుంద‌న్న వాద‌న‌ను కూడా తెర‌మీదికి తెచ్చారు. అయితే.. వాటికి కేంద్రం నుంచి స‌రైన స‌మాధానాలు రాలేదు. దీంతో ఢిల్లీ బార్ అసోసియేష‌న్ స‌హా.. దేశ‌వ్యాప్తంగా వంద‌ల సంఖ్య‌లో సుప్రీంకోర్టులో పిటిష‌న్లు ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం కూడా సుప్రీంకోర్టు మాజీ రాష్ట్ర‌ప‌తి ఇచ్చిన నివేదిక‌ను పంపించింది.

ఆ నివేదిక ప్ర‌కార‌మే తాము వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని పేర్కొంది.దీనిపై అధ్య‌య‌నం చేసి.. పిటిష‌న్ల‌ను క్వాష్ చేయాల‌ని అభ్య‌ర్థించింది. ఇక‌, తాజాగా సుప్రీంకోర్టు ఈ నివేదిక‌ను ప‌రిశీలించి.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై సానుకూలంగా నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం ప్ర‌తిపా దించిన ఖ‌ర్చు త‌గ్గింపును సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా అంగీక‌రించింది. అదేవిధంగా ప‌దే ప‌దే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా.. పాల‌న‌కు విఘాతం ఏర్ప‌డుతోంద‌ని.. అభివృద్ధి ముందుకు సాగ‌డం లేద‌ని పేర్కొన్న వాద‌న‌ల‌తో ఏకీభ‌వించింది.

ఈ క్ర‌మంలోనే తాజాగా సుప్రీంకోర్టు జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఓకే చెప్పింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. లెక్క‌లు కూడా స‌రిపోయాయి. ఇక‌, దేశ‌వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చే వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే దీనిని ప్ర‌వేశ పెట్టి.. ఆమోదం పొందే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.