ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం మడకశిర. ఇక్కడి నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న టిడిపి యువ నాయకుడు ఎంఎస్ రాజు. ఈయన అసాధారణ రీతిలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఆయన సొంత నియోజకవర్గం సింగనమల. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఈక్వేషన్స్ కారణంగా ఆయనను చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పంపించారు. కూటమి హవాతో పాటు తనకున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం బలంతో ఎమ్మెస్ రాజు విజయం దక్కించుకున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం కార్యాలయానికి మాత్రమే పరిమితం కాకుండా లేదా ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వరకే పరిమితం కాకుండా తనదైన శైలిలో ప్రజలకు చేరువవుతున్నారు.
ఎంతగా అంటే ఆయన కనీసం కాన్వాయ్ కూడా పెట్టుకోరు. తన బైక్ మీద ఉదయం ఐదు గంటల నుంచి పొలాలకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకోవడంతో రోజును ప్రారంభిస్తున్నారు. తర్వాత.. ప్రజలను కలుసుకోవడం, ఉదయం 10 గంటలకు ఠంచనుగా పార్టీ కార్యాలయంలో ఉండడం వంటివి ఎమ్మెస్ రాజు దైనందిన చర్యల్లో భాగంగా మారాయి. ఇక ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలని పిలుపు వచ్చినా వెంటనే దానిని అమలు చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధిష్టానం పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే వివాదాలకు దూరంగా ఉంటూనే ఏ చిన్న విమర్శ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతూ పరిస్థితిని అదుపు తప్పకుండా చేసుకోవడంలో ఎంఎస్ రాజు తన సీనియారిటీని నిరూపించుకుంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గం సంక్షేమానికి సంబంధించి గతంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన నేపథ్యం ఉన్న కారణంగా ఆ అనుభవం అప్పుడు ఆయనకు కలిసి వస్తోంది. మడకశిర నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు పీ-ఫోర్ పథకంలో భాగంగా పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి బంగారు కుటుంబాలను అప్పచెప్పే కార్యక్రమాలను కూడా ఈయన భుజాన వేసుకున్నారు.
పార్టీ కార్యక్రమాలతో పాటు నాయకులను సమన్వయం చేయటం, కూటమిలో ఉన్న పార్టీలతో నిత్యం అనుబంధం పెంచుకోవడం, వారితో చర్చిస్తూ ముందుకు సాగడం వంటివి కూడా ఎమ్మెస్ రాజు రాజకీయాలకు కీలక అంశం అనే చెప్పాలి. అదే సమయంలో సింగనమల నియోజకవర్గంలోని తన సొంత మండలం అభివృద్ధిని కూడా ఆయన తరచుగా పర్యవేక్షిస్తున్నారు. నిజానికి సింగనమలలో కూడా టిడిపి విజయం దక్కించుకుంది, అయినప్పటికీ ఎమ్మెస్ రాజు అక్కడ కూడా పర్యటిస్తూ అక్కడ కూడా పర్యటిస్తూ అక్కడి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు.
తద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని చెప్పాలి. ఇలా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎమ్మెస్ రాజు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ అటు పార్టీని ఇటు నాయకులు మరోవైపు ప్రజలను కూడా సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates