వివేకా కేసును ఎవరు ఆపుతున్నారు?

వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు ఈ విషయాన్ని గ‌త నాలుగు రోజులుగా ప్ర‌స్తావిస్తున్నారు. 2019, మార్చి 16న జ‌రిగిన ఈ దారుణ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితులు ఎవ‌రు? అనేది ఇంకా స‌స్పెన్సులోనే ఉంది. అనేక విచార‌ణ‌లు, అనేక ద‌ర్యాప్తు సంస్థ‌లు దీనిలో పాలుపంచుకున్నా.. ఏళ్ల త‌ర‌బ‌డి విచార‌ణ‌లు జ‌రిగినా.. విచార‌ణ ప‌రిధి ఏపీ నుంచి తెలంగాణ‌కు చేరినా.. ఈ కేసు మాత్రం ఇప్ప‌టికీ ముడి ప‌డ‌లేదు.

అనేక మందిని విచారించారు… సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అయినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఈ కేసు వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయినా.. కూడా ఎక్క‌డా ఈ కేసు ముందుకు సాగ‌డం లేదు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్న సీఎం చంద్రబాబు త‌న ప్ర‌సంగాల్లో వివేకా కేసును ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇటు కాకినాడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలోనూ.. కుప్పం ప‌ర్య‌ట‌న‌లోనూ ఆయ‌న దీనిని ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

వైసీపీ నాయ‌కులు త‌న‌నే మోసం చేశార‌ని.. తాను అప్ప‌ట్లోనే వారిని అరెస్టు చేసి ఉంటే బాగుండేద‌ని.. కానీ.. గుండె పోటు డ్రామాలు ఆడార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందుకూడా ఇదే విష‌యం చెప్పారు. మ‌రి ఇప్పుడు మ‌రోసారి ఎందుకిలా చేస్తున్నారు? దీనివెనుక చంద్ర‌బాబు ఆలోచ‌న ఏంటి? అనేది చ‌ర్చ‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. తాము అధికారంలోకి వ‌స్తే.. వివేకా కేసును తిర‌గ‌దోడ‌తామని.. వైఎస్ కుమార్తెకు న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

కానీ, ఏడాది పాల‌న త‌ర్వాత కూడా.. ఈ కేసులో ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక పోతోంది. ఎందుకంటే.. ప్ర‌స్తు తంఈ కేసు విచార‌ణ ప‌రిధి.. కేంద్రంలో ఉంది. మ‌రి కేంద్రంలోనూ టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తోంది.. కేంద్రంలోనూ మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు క‌దా! మ‌రి అయిన‌ప్ప‌టికీ వివేకా కేసు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు? అనేది ప్ర‌శ్న‌. కేంద్రంలో జ‌గ‌న్‌కు ఉన్న ప‌రోక్ష సంబంధాలు కార‌ణంగానే ఇది ముందుకు సాగ‌డం లేదు.

అందుకే.. దీనిని ప్ర‌స్తావించ‌డం ద్వారా.. జ‌గ‌న్‌ను ఇక్క‌డ డైల్యూట్ చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. త‌ర‌చుగా కేసును ప్ర‌స్తావించ‌డం ద్వారా జ‌గ‌న్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఉద్దేశంతో నే.. ఆయ‌న మ‌రోసారి వివేకా కేసును ఆయుధంగా మార్చుకున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో జ‌గ‌న్‌ను అష్ట‌దిగ్భంధ‌నం చేయాల‌న్న‌ది వ్యూహం. అందుకే..మ‌రోసారి వివేకా కేసు తెర‌మీదికి వ‌చ్చింద‌ని అంటున్నారు.