అమ‌రావ‌తిపై భారీ అప్డేట్‌.. అప్ప‌టిక‌ల్లా పూర్తి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ అప్డేట్ ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో తీవ్ర‌నిర్ల‌క్ష్యానికి గురైన అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నుల‌ను కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక ప‌రుగులు పెట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రోవైపు.. ఇదివ‌ర‌కే తీసుకున్న‌భూములు స‌రిపోవ‌ని గుర్తించిన స‌ర్కారు.. మ‌రో 44 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించేందుకు(ల్యాండ్ పూలింగ్‌) రెడీ అయింది.

అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, స్మార్ట్ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, క్రీడా న‌గ‌రం వంటి వాటికి ఈ భూముల‌ను వినియోగించ‌నున్నారు. ఇలా ప‌నులు వ‌డివ‌డిగా సాగుతున్న క్ర‌మంలో అమ‌రావ‌తిని ఎప్ప‌టిలోపు పూర్తి చేస్తార‌న్న ప్ర‌శ్న త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తూనే ఉంది. పెట్టుబ‌డి దారులు కూడా ఈవిష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తాజాగా దీనిపై స‌ర్కారు అప్డేట్ చేసింది. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల్లో తొలి ద‌శ అమ‌రావ‌తిప‌నుల‌ను పూర్తి చేయ‌నున్న‌ట్టు ఏర్కొంది.

తొలిద‌శ‌లో రాజ‌ధానిలో హైకోర్టు స‌హా.. న‌వ‌న‌గ‌రాల‌ను పూర్తి చేయ‌నున్నారు. ఇది 2028 డిసెంబ‌రు నాటికి పూర్తి చేసుకుంటుంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. అదేవిదంగా స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం ప‌నులు ఏడాది త‌ర్వాత‌.. ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. దీనికి సంబంధించి 44 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటున్నామ‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం 20 వేల ఎక‌రాల భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు.

ఆయా నిర్మాణాల కోసం.. 10వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన 30 వేల ఎక‌రాల‌ను కూడా రైతుల‌కు రిట‌ర్న్ ఫ్లాట్లు ఇచ్చేందుకు, ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగిస్తామ న్నారు. కొంద‌రు రాజ‌ధానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూనే ఉన్నార‌ని.. రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కానీ.. ఒక మ‌హాయ‌జ్ఞం చేసేప్పుడు ఇవ‌న్నీ.. చిన్నిచిన్ని స‌మ‌స్య‌లేన‌ని చెప్పుకొచ్చారు. రైతుల‌కు చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం ఉంద‌న్నారు.