తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు.. అనే మాటే వద్దని అందరూ కలసి కట్టుగా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తేల్చేశారు. తాజాగా ఆయన పార్టీ నాయకులతో(పీసీసీ) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్గత కలహాలపై వారితో రహస్యంగా చర్చించారు. ఎవరూ పార్టీకి తేడాలేదన్నారు. అందరూ సమానులేనని చెప్పారు. తొలిసారి విజయం దక్కించుకున్న ఆనందం ఉండడం తప్పుకాదని.. మలి విజయం కోసం.. మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సి ఉందని ఖర్గే చెప్పారు. ఈ విషయంలో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కలసి కట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న ఖర్గే.. ఈ విషయంలో అధిష్టానం చెప్పింది అందరూ పాటించాలని సూచించారు. “మీలో మీరు గొడవలు పడడం సరికాదు. పార్టీ ఇప్పుడు విజయం దక్కించుకుంది. దీనికి కారణాలు అందరికీ తెలుసు(ప్రజల్లో కేసీఆర్ సర్కారు పై వ్యతిరేకత పెరగడం అనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు) కానీ, వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుంటేనే మన సత్తా తెలుస్తుంది. అలా చేయాలంటూ.. అందరూ ఏకతాటిపై నిలవాలి. పార్టీ కార్యక్రమాలను లైట్‌గా తీసుకోవద్దు. వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వద్దు” అని ఖర్గే తేల్చి చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న పనులను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత కేవలం మంత్రివర్గంపైనే లేదన్న ఆయన.. నాయకులు, ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఉందని ఖర్గే తెలిపారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అందరూ కలిసి విజయం దక్కించుకుని పార్టీగిఫ్టుగా ఇవ్వాలని సూచించారు. “అందరూ కలిసి పనిచేయండి. ఐక్యతతోనే మనం విజయం దక్కించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అందరూ కలిసి పనిచేశారు. అందుకే ఈ విజయం మనకు లభించింది. వచ్చే ఎన్నికల నాటికి మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. వారి ఉచ్చులో పడకుండా మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి. మన ప్రభుత్వం అనుకుని పనిచేయండి.ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు” అని హితవు పలికారు.
కాగా..కొన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాలపైనా ఖర్గే అంతర్గత సమావేశంలో సీఎం సహా రాష్ట్ర పీసీసీ చీఫ్‌తో చర్చించారు. ఘర్షణలు పెంచేలా ఎవరూ ప్రోత్సహించవద్దని.. గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వద్దని తేల్చి చెప్పారు. ఏదైనా ఉన్నా.. అంతర్గత చర్చల ద్వారానే పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ముఖ్యంగా మీడియా ముందు అంతర్గత సమస్యలను ప్రస్తావించరాదని కూడా తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates