చంద్ర‌బాబు ఆలోచన మంచిదే.. వైసీపీనే త‌డ‌బ‌డుతోంది!

అవును! ఇప్పుడు ఈ మాటే స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ నేత‌లు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ నేత‌ల‌ను స‌రిగా అర్ధం చేసుకోలేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లేన‌ని అంటున్నారు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఇటీవ‌ల అబ్దుల్ స‌లాం కుటుంబం ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి పోలీసుల వేధింపులే కార‌ణ‌మ‌ని అన్ని ప‌క్షాల నాయ‌కులు స‌హా స్థానిక ప్ర‌జ‌లు, మైనారిటీ నాయ‌కులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఓ కుటుంబం కుటుంబ‌మే.. ఇలా ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవ‌డం.. అందునా.. తాము మైనారిటీ ముస్లింల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పుకొంటున్న జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంలోనే ఇలా జ‌ర‌గ‌డం.. రాజ‌కీయ నేత‌ల‌నే కాదు సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా విస్మ‌యానికి గురి చేసింది. దీనిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీ కూడా ఖండించింది. వెంట‌నే స్థానిక నాయ‌కురాలు, మాజీ మంత్రి అఖిల ప్రియ‌ను కుటుంబం వ‌ద్ద‌కు పంపించి ప‌రామ‌ర్శించేలా చేసింది. ఈ ప్ర‌క్రియ స‌ర్వ‌సాధార‌ణంగా ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ అయినా చేసేదే. అలా చేసేందుకే క‌దా ప్ర‌తిప‌క్షాలు ఉన్న‌ది. కానీ, బొత్స సార్‌.. ఉవాచ వేరేగా ఉంది.

నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంద‌ని మంత్రి బొత్స చెప్పేశారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. అంతేకాదు.. చంద్రబాబు ప్రోద్బలం తోనే నిందితుల తరపున టీడీపీ లాయర్లు వాదించారని పేర్కొన్నారు. కానీ, అంత పెద్ద సీనియ‌ర్ నాయ‌కుడు.. వైసీపీలో కీల‌క స్థానంలో ఉన్న బొత్స ఇలా.. వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని రాజకీయ విశ్లేష‌కులు సైతం త‌ప్పుప‌డుతున్నారు. ఘ‌ట‌న జ‌రిగాక సీఎం స్పందించార‌ని అన‌డానికి అదేమీ ప్ర‌కృతి విప‌త్తు కాదు.. అనుకోకుండా జ‌రిగింది కూడా కాదు.. పోలీసుల‌ను నియంత్రించ‌లేని ప‌రిస్థితిలో , రాజ‌కీయ ఒత్తిళ్ల మేరకు జ‌రిగిన ఘ‌ట‌న‌గా పేర్కొంటున్నారు.

అంతేకాదు.. చంద్ర‌బాబు ప్రోద్బ‌లంతో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ పొందినా.. విధుల నుంచి వారిని తొల‌గించే అవ‌కాశం ప్రభుత్వానికి ఉంది క‌దా?! అనే ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నేత‌లు కూడా ఇలానే చేసిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోయినా..క‌నీసం ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అయినా.. స్పందించాల‌నేది ప్ర‌జ‌లు కోరుకునే విష‌యమే. ఇందులో ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసింది ఏముంది? చంద్ర‌బాబు చేసిన అతి ఏముంది? టీడీపీని అర్ధం చేసుకోవ‌డంలోనే వైసీపీ నేత‌లు ఎక్క‌డో త‌డ‌బ‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.