తెలంగాణ బీజేపీలో పదవుల పందేరం కొనసాగుతోంది. తాజాగా రామచందర్‌రావుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించిన అధిష్టానం.. ఈ పోస్టును ఆశించిన ఒకరిద్దరు నాయకులను సంతృప్తి పరిచేందుకు మరో రూపంలో వారికి ప్రమోషన్ ఇస్తోంది. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ పార్లమెంటు ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు కీలక పదవిని ఇచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే ఆమెకు రెండు పదవులు ఉన్నా.. ఇప్పుడు మూడో పదవిని కట్టబెట్టడం ద్వారా ఫైర్ బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నట్టు అయింది. తద్వారా మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో బీజేపీని పుంజుకునేలా చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న డీకే అరుణకు.. ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణ ఛైర్మన్ కూడా గతంలో ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా అరుణ వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆమె రాష్ట్ర పార్టీ పగ్గాలను ఆశించారన్నది అందరికీ తెలిసిందే. దీని కోసమే గత నెలలో వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి.. మరీ ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా నియమించారు. ఈ పదవిలో ఆమె మూడు సంవత్సరాలు కొనసాగుతారు. బీజేపీలో కీలకమైన జాతీయ కౌన్సిల్ పార్టీకి కీలక సమాచారం ఇవ్వడంతోపాటు.. సూచనలు, సలహాలు కూడా ఇస్తుంది.
ఇక, ఇదే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పద్మజారెడ్డికి కూడా పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. ఆమెను కూడా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా తీసుకున్నారు. ఆమె కూడా ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఇలా.. బీజేపీ ఒకే జిల్లా నుంచి ఇద్దరు మించి నాయకులను పదవుల్లోకి తీసుకోవడం వెనుక మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌కుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు కీలక నాయకులకు జాతీయస్థాయిలో పదవులు ఇవ్వడం ద్వారా పార్టీని పుంజుకునేలా చేస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates