చెవిరెడ్డి గారూ… ఈ గోలేమిటండీ?

వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోల ఇప్పుడు మరీ ఎక్కవ అయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి పాత్ర ఉందో, లేదో తెలియదు గానీ… చెవిరెడ్డి మాత్రం తనను ఈ కేసులో అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని పలుమార్లు ఆరోపించారు. చెవిరెడ్డి కోరినట్లుగానే ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేయగా… ఇప్పుడు తనను అన్యాయంగా అరెస్టు చేశారని, అక్రమంగా కేసులు నమోదు చేశారని గొంతు చించుకుని మరీ వాపోతున్నారు.

ఇటీవలే బెంగళూరు మీదుగా శ్రీలంక వెళ్లిపోయేందుకు పక్కా ప్లాన్ వేసుకున్న చెవిరెడ్డి… తన బాల్య మిత్రుడు, ఈ కేసులో పాత్ర ఉందని సిట్ భావిస్తున్న వెంకటేశ్ నాయుడులు అడ్డంగా బుక్కైపోయారు. అప్పటికే వారిపై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు…వారిని కొలంబో విమానం ఎక్కనీయకుండా అదుపులోకి తీసుకుని సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక లేట్ చేస్తే నిజంగానే చెవిరెడ్డి పారిపోవడం ఖాయమని భావించిన సిట్… బెంగళూరు వెళ్లి మరీ వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించి… కోర్టులో ప్రవేశపెట్టి… కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించింది.

ఇక తాజాగా చెవిరెడ్డి నుంచి కేసు గురించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్న సిట్ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు…చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ ను మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈ కస్టడీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళవారం బెజవాడ జైలు నుంచి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అక్కడ మీడియా ప్రతినిధులు కనిపించడంతో చెవిరెడ్డి ఒక్కసారిగా తనదైన శైలి వాదనతో గొంతు పెంచారు. “నాపై అక్రమంగా కేసులు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారు. సిట్ లో మహా మహా నటులు ఉన్నారు. వారందరికి దేవుడే తగిన రీతిలో బుద్ధి చెబుతాడు. ప్రకృతి వీరిని ఏమాత్రం వదలదు” అంటూ చెవిరెడ్డి పెద్ద పెట్టున అరుస్టూ సాగారు.

చెవిరెడ్డి స్వతహాగా ఓ లాయర్. తన గ్రామానికి అతి చేరువలో ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆయన న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే ఇంకో రెండు, మూడు పీజీలు కూడా ఆయన పూర్తి చేశారు. అలాంటి భాస్కర్ రెడ్డి…అరెస్టు కాగానే ఓ సాధారణ వ్యక్తి మాదిరిగా లబోదిబోమంటూ పోలీసులపై, ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ సాగడం నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఉన్నత విద్యనభ్యసించిన తన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్టు కాబోతున్నాడన్న విషయం చెవిరెడ్డిని మరింతగా వేదనకు గురి చేసి ఉంటుందని, ఈ కారణంగానే ఆయన అలా ప్రవర్తించి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.