అమ‌రావ‌తి-బ‌న‌క‌చ‌ర్ల‌.. త‌గ్గేదేలా!

కీల‌క ప్రాజెక్టులైన అమ‌రావ‌తి, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుల‌పై వెనక్కి త‌గ్గేదేలేద‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ వాటిని నిర్మించి పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. ఇక్క‌డ డౌటు రావొచ్చు.. బ‌న‌క‌చ‌ర్ల అంటే..తెలంగాణ రాష్ట్రంతో వివాదం ఉంది కాబ‌ట్టి.. దీనికి కేంద్రం నుంచి అడ్డంకులు వ‌స్తున్నాయి కాబ‌ట్టి.. ఈ విష‌యంలో స‌ర్కారు గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూట‌మి ప్ర‌భుత్వం ‘త‌గ్గేదేలా’ అని కామెంట్లు చేయ‌డంలో అర్థం ఉంది. కానీ.. అమ‌రావ‌తికి ఏమైంది? ఎందుకు త‌గ్గేదేలా.. అంటూ కామెంట్ చేయాల్సి వ‌చ్చింది? అనేది ప్ర‌శ్న‌.

విష‌యం ఏంటంటే..
అమ‌రావ‌తి విష‌యంలోనూ కూటమి ప్ర‌భుత్వానికి చిక్కులు ఏర్ప‌డ్డాయి. గ‌తంలో అనుకున్న‌ట్టుగా అమ‌రావ‌తిని 33-34 వేల ఎక‌రాల్లో మాత్ర‌మే పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావించ‌డం లేదు. క్వాంట‌మ్ వ్యాలీ స‌హా.. అనేక ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నా యి. అదేవిధంగా రాజ‌ధానిలో ఏఐ యూనివ‌ర్సిటీ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ త‌ర‌హా ప్రాజెక్టులు 2014-19 మ‌ధ్య కాలంలో రాలేదు. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఈ ఏడాది కాలంలోనే తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో వాటిని ఏర్పాటు చేసేందుకు మ‌రింత భూమి అవ‌స‌రం. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షించేందుకు ఇక్క‌డ విమానాశ్ర‌యం కూడా అవ‌స‌రం.

ఈ నేప‌థ్యంలో రాజ‌ధానిలో భూ స‌మీక‌ర‌ణ‌కు మ‌రోసారి స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌లు చేసింది. ఈ క్ర‌మంలో మ‌రో 44 వేల ఎక‌రాల‌ను తీసుకోనున్నారు. అయితే.. ఇక్క‌డే వైసీపీ స‌హా కొన్ని వామ‌ప‌క్షాలు.. అడ్డంకులు సృష్టిస్తున్నాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. రైతులు ఆయా భూముల‌ను ఇవ్వ‌కుండా ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో రోజూ యాగీ చేస్తున్నార‌ని భావిస్తున్న ప్ర‌భుత్వం.. తాజాగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా 44 వేల ఎక‌రాల‌ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి తాజాగా నిబంధ‌న‌లు, నియ‌మాల‌తో జీవో జారీ చేసింది. గ‌తంలో భూములు ఇచ్చిన రైతుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నామో.. ఇప్పుడు కూడా అంత ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రైతుల నుంచి భూములు తీసుకోవ‌డంలోనూ.. అమ‌రావ‌తిని పూర్తి చేయ‌డంలోనూ ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా త‌గ్గేదేలా అని చెప్పిన‌ట్ట‌యింది.

ఇక‌, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యానికి వ‌స్తే.. దీనిపై కేంద్రంలోని ప‌ర్యావ‌ర‌ణ శాఖ అధికారులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అస‌లు గోదావ‌రిలో మిగులు జ‌లాలు ఎన్ని.. ఎక్క‌డెక్క‌డ ఈ ప్ర‌వాహాలు ఉన్నాయ‌న్న విష‌యాల‌పై వివ‌రాలు కోరుతూ.. ప్రాధ‌మిక నివేదిక‌ను తిప్పిపంపారు. అయితే.. దీనిని రాష్ట్ర ప్ర‌భుత్వంసీరియ‌స్‌గా తీసుకుంది. దీనిని వ‌దిలి పెట్ట‌డానికి వీల్లేద‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో అటు రాజ‌కీయంగా తెలంగాణ‌, కేంద్రంపై ఒత్తిడి చేయ‌డం..మ‌రోవైపు.. నిపుణుల‌తో దీనిపై మ‌రిన్ని అధ్య‌య‌నాలు చేయించి ఎలాగైనా స‌రే.. బ‌న‌క‌చ‌ర్ల‌పై ప‌ట్టు వీడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది.