హైదరాబాద్ నడిబొడ్డులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయమే ఉంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇదిలావుంటే.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో తృటిలో తమ అభ్యర్థి ఓడిపోయారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికలో మాత్రం గెలిచి తీరాలని నిర్ణయించు కుంది. ఇక, అభ్యర్థుల పరంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది క్యూలో ఉన్నారు.
వాస్తవానికి 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇ ప్పుడు ఆయనే తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై బహిరంగంగా కూడా అజారుద్దీన్ ప్రకటన చేశారు. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలానే సమయం ఉంది. మరోవైపు తాజాగా.. ఇంకో పేరు కూడా తెరమీదికి వచ్చింది. జీవీఎంసీ మేయర్, సీనియర్ నాయకుడు కేకే కుమార్తె.. గద్వాల విజయలక్ష్మీ కూడా.. పోటీకి రెడీ అవుతున్నారన్న గుసగుస వినిపిస్తోంది.
నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొనడంతోపాటు.. వీధి వీధిలోనూ విజయలక్ష్మీ పర్యటిస్తున్నారు. అంతేకాదు .. స్థానికులను మచ్చి క చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. అసలు విషయం ఎలా ఉన్నా.. ఆమె మాత్రం.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని.. అందుకే ఇలా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ..ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా.. గద్వాల విజయలక్ష్మి పర్యటనలు.. చేస్తున్న కార్యక్రమాలు ఆమె ఇక్కడ ఉప పోరులో పోటీ చేయడం కోసమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
కట్ చేస్తే.. అసలు ఈ సిట్టింగ్ సీటు సొంతం చేసుకున్న బీఆర్ ఎస్ పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ నుంచి జరగనున్న ఉప పోరులో మాగంటి కుమారుడికి అవకాశం ఇస్తామని.. ఇప్పటికే కేసీఆర్ ప్రకటన చేశారు. ఈక్రమంలో ఎలాంటి పోటీ లేకుండా.. ఏకగ్రీవంగా విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఎంఐఎం ఎలానూ.. అనుకూలమే కాబట్టి.. కాంగ్రెస్, బీజేపీలను ఏకగ్రీవం అయ్యేలా కోరే ఉద్దేశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates