ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం నుంచి `క్వాంటమ్ వ్యాలీ` గురించి హైలెట్ చేస్తున్నారు. దీనిని ఆయన అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోలుస్తున్నారు. అంతేకాదు.. “అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం“ అని కూడా చెబుతున్నారు. అంటే.. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే.. ఇక, అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదా? అగ్రరాజ్యంలో ఉద్యోగాల వేటతో పనిలేదా? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపైనే యువత ఎక్కువగా చర్చిస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసినంత మాత్రాన.. దీనికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. సిలికాన్ వ్యాలీ అనేది.. ప్రఖ్యాత టెక్ కంపెనీలకు ప్రధాన వేదిక. ఇక్కడే యాపిల్, మెటా, సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, నొవిడియా, హెచ్‌పీ సహా అనేక కంపెనీలు ఉంటాయి. ఇవి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు తయారు చేస్తాయి. అంతేకాదు.. బహుళ జాతి కంపెనీలకు కూడా సిలికాన్ వ్యాలీ ఒక కీలక వేదిక. సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్‌కు కూడా ఈ వ్యాలీ పేరొందింది. దీంతో టెక్ రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారు.. సిలికాన్ వ్యాలీని ఎంచుకుంటారు.
అదేవిధంగా.. కేంద్ర ప్రభుత్వం మన దేశంలోనూ `నేషనల్ క్వాంటం మిషన్`ను ప్రకటించింది. సిలికాన్ వ్యాలీ తరహాలో భారత్‌లోనూ అలాంటి దిగ్గజ కంపెనీలను తీసుకురావాలన్నది వ్యూహం. ఈ మిషన్‌ను ప్రకటించిన వెంటనే సీఎం చంద్రబాబు దీనిని అందిపుచ్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. క్వాంటం వ్యాలీ పార్క్ కు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్ ను తీసుకువస్తారు.
వివిధ ఉపకరణాల నుంచి రియల్-టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమ వంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ , క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలను వినియోగిస్తారు. వీటిని క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నారు. ఆయా రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్వాంటమ్ వ్యాలీలో కూడా ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. కానీ.. సిలికాన్ వ్యాలీ ప్రత్యేకత, క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేకతలు వేర్వేరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates