39కి చేరిన మృతులు.. మరో 43 మంది ఏమయ్యారో?

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం జరిగిన ప్రమాదం భారీ ప్రమాదం ఎంతమాత్రం కాదు. అంతకు వంద రెట్లకు మించిన ప్రమాదం అది. సోమవారం ప్రమాదం జరిగిన సమయంలో 8 మంది చనిపోగా… మంగళవారం ఉదయానికంతా మృతుల సంఖ్య ఏకంగా 39కి చేరిపోయింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇదిలా ఉంటే… ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలోనే ఉన్న 43 మంది ఆచూకీ ఇప్పటిదాకా లభించనేలేదు. వీరంతా ఏమయ్యారన్నది ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీనిని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఈ భవనం లోని వారంతా శిథిలాల కింద చిక్కి ప్రాణాలు వదిలి ఉంటారన్న భావన వ్యక్తమవుతోంది. తొలుత నమోదు అయిన 8 మరణాల తర్వాత పెరిగిన మరణాలన్నీ ఈ శిథిలాల కింద నుంచి బయటపడ్డవే. ఈ శిథిలాల కింద నలిగి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా మరణించినట్లు సమాచారం. వెరసి శిథిలాలను పూర్తిగా తొలగిస్తే.. మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… మంగళవారం ఉదయం తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగిన సిగాచీ పరిశ్రమ ను స్వయంగా పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్ తదితరులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చిన ఆయన కంపెనీ మొత్తం కలియదిరిగారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షించిన ఆయన ప్రమాదం జరగడానికి గల స్పష్టమైన కారణం ఏమిటో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కంపెనీ గత చరిత్ర కూడా తనకు కావాలని ఆయన ఆదేశించారు.

మరోవైపు సిగాచీ కంపెనీ యాజమాన్యంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా కంపెనీ యాజమాన్యం ఇక్కడికి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఇంతటి నిర్లక్ష్యంతో కంపెనీలను నడిపే వారికి అనుమతులు ఎలా ఇస్తున్నారని అధికారులను నిలదీశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే… బాదితులకు ఇప్పటిదాకా ఏం భరోసా ఇచ్చారని కూడా ప్రశ్నించారు. తక్షణమే కంపెనీ యాజమాన్యం రావాలని, లేనిపక్షంలో కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ.1లక్ష చొప్పున, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని ఆయన ప్రకటించారు.