తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్భానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లని అన్నయ్యపై షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా కూడా మారాయి. మోదీకి జగన్ దత్తపుత్రుడు అని పలుమార్లు విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి మోదీని పల్లెత్తు మాట అనే దమ్ము, ధైర్యం జగన్ కు లేవని షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం లేకపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా జగన్ ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీకి జగన్ దాసోహమయ్యారని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. విభజన హామీల కోసం ఏనాడూ జగన్ పోరాడలేదని, ఏపీకి జరిగిన అన్యాయం గురించి ఏనాడూ కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ చివరికి తన మెడనే మోదీ ముందు వంచారని చురకలంటించారు. మోదీని జగన్ ఒక్క మాట అనకుండా, కేవలం చంద్రబాబును విమర్శిస్తున్నారని, మోదీకి దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని ఏకిపారేశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు కుదించారని, దానిపై ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలు అమలు కాకపోయినా మోదీకి జగన్ మద్దతు పలికారని విమర్శించారు. ముందు నుంచి బీజేపీని వైఎస్ వ్యతిరేకించారని, కానీ జగన్ మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates