ఏపీలోని కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ.. తాజాగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లాల పార్టీ ఇంచార్జులు.. ఇలా ఓ వెయ్యి మంది వరకు హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక్క రోజు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకులకు, మంత్రులకు విడివిడిగా దిశానిర్దేశం చేశారు. పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు చెప్పారు.
వైసీపీ దూకుడును ఇప్పటి నుంచే అడ్డుకోవాలని.. ఎన్నికలకు ముందు వరకు వేచి చూసే రోజులు పోయాయని చంద్రబాబు తెలిపారు. “ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రజల మధ్య ఉంటామని అనుకునే రోజులు ఇప్పుడు పోయాయి. వైసీపీ నాయకులు మనపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకునే బాధ్యత మీదే. అందరూ కలసి కట్టుగా ప్రజలను కలవాలి. వైసీపీ వ్యతిరేక ప్రచారాన్నిఅడ్డుకోవాలి.” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అదే సమయంలో మంత్రులకు కూడా కొన్ని సూచనలు చేశారు. మంత్రులు కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని.. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రధాన సమస్యలతో పాటు.. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా.. ప్రజల మనసులు చూరగొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎవరూ ఈ విషయంలో అలసత్వం వహించడానికి వీల్లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా.. సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు.
ఇక, వచ్చే నెల 2 నుంచి ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ ప్రచారం చేయాలని చంద్రబాబు అందరికీ సూచించారు. అందరూ ఉమ్మడిగా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నారు. ఎక్కడా తేడారాకుండా చూడాలని.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రచారం చేస్తున్నామని భావించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజల మనసులను కలుషితం చేసే శక్తులను కట్టడి చేసేందుకుఅన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates