విశాఖపట్నంలో ఇటీవల జరిగిన జిల్లాఅభివృద్ధి సమీక్షామండలి(డీడీఆర్సీ) సమావేశంలో.. భూముల వ్యవహారంపై ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల ఇన్చార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ల మధ్య ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరును ఉద్దేశించి విజయసాయి చేసిన వ్యాఖ్యలతో ధర్మశ్రీ, అమర్నాథ్ విభేదించారు. ఈ సందర్భంగా విజయసాయిపై ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం.. నేతలు నేతలు అనడం కాదు.. ఎవరు భూములు ఆక్రమిస్తున్నారో.. చెప్పాలంటూ.. ధర్మశ్రీ ప్రశ్నించడం.. వెంటనే సాయిరెడ్డి మైకును నిలిపివేయడం సంచలనంగా మారింది.
అయితే.. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందుగానే సీఎం జగన్ తాజాగా ఈ వ్యవహారంపై వ్యవహరించిన తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. సాయిరెడ్డిని కాపాడాలనే తహతహ సీఎంలో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇంతకన్నా ఎక్కువగానే అనేక మంది నాయకులపై అంతర్గత పోరు సాగుతోంది. నేరుగా మంత్రి జయరాంపై భూములు ఆక్రమించారని.. ఈఎస్ ఐ కుంభకోణానికి సంబంధించి.. ఆయన కుమారుడు కారును గిఫ్ట్‌గా తీసుకున్నారని అంటూ.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధారాలతో సహా.. బయట పెట్టారు. ఇక, నెల్లూరులో ఏకంగా ఓ కొండనే తొలిచేశారంటూ.. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులే కన్నెర్ర చేశారు.
అదేవిధంగా.. మంత్రులకు మంత్రులకు పడడం లేదు. నియోజకవర్గాల్లో తమకు కనీసం.. ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. విశాఖ ఘటన జరిగిన రోజే.. తూర్పుగోదావరి జిల్లా పీ.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు.. మంత్రి కురసాల కన్నబాబును ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇవన్నీ.. వైసీపీకి తీవ్ర ఇబ్బందికర పరిణామాలే. వీటికితోడు.. తమ భూములను ఎమ్మెల్యే కాటసానిరాంభూపాల్‌రెడ్డి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె కుమార్తె.. రోడ్డుకెక్కి.. పట్టించుకోకపోతే.. ప్రాణాలు తీసుకుంటామంటూ.. హెచ్చరించింది.
మరో ఘటనలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డిపై ఓ కటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు దక్కాల్సిన కాంట్రాక్టును ఎమ్మెల్యే నెల్లూరుకు చెందిన వారికి అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించింది. ఇవన్నీ సీరియల్‌గా ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే జరిగాయి. అయితే. వాటిలో దేనిపైనా జగన్ స్పందించలేదు. ఎవరినీ పిలవలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరినీ హెచ్చరించే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ, విశాఖ ఘటన తెరమీదికి వచ్చే సరికి మాత్రం వెంటనే అటు కరణం.. అమర్నాథ్, ఇటు సాయిరెడ్డిని పిలిచి పంచాయతీ పెట్టడం ఆసక్తిగా మారింది.
ఈ ఎపిసోడ్లో జగన్ ఏం చేయాలనుకున్నారు? ఆయన మనోభావం ఏంటి? అనేదే ఆసక్తిగా ఉంది. పార్టీలో కీలకమైన నాయకుడు.. ఎన్నికల వేళ.. తాను పాదయాత్రలో ఉంటే.. నియోజకవర్గాల్లో రాజకీయ చక్రం తిప్పిన నేత.. సాయిరెడ్డి. అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం మధ్య వారధిలా ఉన్నది కూడా ఆయనే. ఇలాంటి నాయకుడిపై కొన్నాళ్లుగా విశాఖ కేంద్రంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయినా.. జగన్ పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలే తిరగబడే పరిస్థితి వచ్చింది. అయితే.. ఇప్పుడు మాత్రం అలెర్ట్ అయినా.. సాయిరెడ్డిని కాపాడే ప్రయత్నం చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
నిజానికి ధర్మశ్రీ వైఎస్ హయాంలోనూ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతి చేయని నాయకుడిగా పేరున్న ధర్మశ్రీ.. ఇప్పుడు బయటపడ్డారంటే.. సాయిరెడ్డి దూకుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని.. ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అయినా.. జగన్ సాయిరెడ్డిని వదిలి.. వారికి మాత్రం సుద్దులు చెప్పడం విశేషం. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని.. బహిరంగ సమావేశాల్లో వాటి ప్రస్తావన మంచిది కాదని జగన్ సూచించారు. అంటే.. సాయిరెడ్డి మాటే వినాలని ఆయన చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో సాయిరెడ్డిని కాపాడే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం.