కొడాలి ప్లేస్…. రాము రీప్లేస్ ..!

దాదాపు ఏడాది కాలం తర్వాత తన సొంత నియోజకవర్గంలోకి ఎవరైనా నాయకుడు వస్తే ఆయనకు చెందిన కార్యకర్తలు, ఆయనకు చెందిన అనుచరులు, ఆయన అనుకూల వ్యక్తులు సంబరాలు చేసుకుంటారు. స్వాగతాలు పలుకుతారు. ఒక రకంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. రాకరాక వచ్చిన నాయకుడికి గజమాలలు వేసి స్వాగతాలు పలుకుతారు. ఇది గతంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనిపించింది. ముఖ్యంగా గుడివాడ వంటి కీలక నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందని, కనిపిస్తుందని అందరూ భావించారు.

అయితే ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు విజయం దక్కించుకొని 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాస్ లీడర్ కొడాలి నాని విషయంలో మాత్రం ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు తిరుగు లేదన్న చోట ఇప్పుడు తనను తాను అద్దంలో చూసుకునే పరిస్థితి కొడాలి నాని కి ఏర్పడింది. గత ఏడాది ఎన్నికల తర్వాత ఆయన శుక్రవారం గుడివాడ నియోజకవర్గం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతాలు లభిస్తాయని, కీలక నాయకులు ముందుకు వస్తారని ఆశించారు.

కానీ ఎక్కడా ఊసు కనిపించలేదు. ఆ ధ్యాస వినిపించలేదు. పైగా కీలక నాయకుల్లో కొంతమంది ఫోన్లు ఎత్తలేదని చర్చ తాజాగా తెర‌మీదకు వచ్చింది. దీనిని బట్టి కొడాలి నాని గ్రాఫ్ పడిపోయిందనేది కొందరి అంచనా. వాస్తవానికి ఏడాది కాలంలోనే ఇంత భారీ స్థాయిలో గ్రాఫ్ పడిపోతుందని ఎవరూ ఊహించరు. కానీ, రెండు కారణాలతో కొడాలి గ్రాఫ్ పడిపోయింది అనే చర్చ నడుస్తోంది. ఒకటి ఆయన చేసుకున్న స్వయంకృత వ్య‌వ‌హారాలు.. స్వయంకృత తప్పులు. రెండోది. ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి వంటివి అని పరిశీలకులు చెబుతున్నారు.

వెనిగండ్ల రాము అందర్నీ కలుపుకొని పోవడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటూ నోటి దురుసు లేని నాయకుడిగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో రాజకీయాలకు తటస్థంగా ఉండేవారు కూడా వెనిగండ్ల రాము విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ఇది పడాలి నాని కి భారీ ఇబ్బందికర పరిస్తితిని కల్పించింది. ఇక నానీ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు నానిని సపోర్ట్ చేస్తే తమ పై కేసులు నమోదయ్య అవకాశం ఉందని, తమకు ఇబ్బందులు తప్పవని మెజారిటీ కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు.

ఈ కారణంగా కొడాలి నాని నియోజకవర్గానికి వచ్చినా ఆయనకి ఎవరు భారీ స్వాగతం పలకలేదు. కీలక నాయకులు కనిపించలేదు. అయితే ఈ విషయంలో కొడాలి నాని అనుచరులు మరో మాట కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వచ్చింది… ముందస్తు బయలు కోసమని, ఇటువంటి కోర్టు పనుల మీద వచ్చినప్పుడు తామ హడావిడి చేయడం పద్ధతి కాదని దూరంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఇది వాస్తవం కాదని అందరికీ తెలిసిందే. కొడాలి నాని కి దూరంగా ఉండడమే బెటర్ అన్న భావన చాలామందిలో ఉండడం వల్లే ఇలా జరిగిందనేది స్థానికంగా జరుగుతున్న మరో చర్చ.