ఏపీ బిజెపి రేసులో ఎంత‌మందంటే..

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ అధిష్టానం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ పదవి కోసం నాయకులు పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా బిజెపి అధ్యక్షులను చూస్తే బీసీ సామాజిక వర్గాలకు ఆ పార్టీ పెద్దపేట వేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓసి సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, మారుతున్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని బిజెపి బీసీ జపం జపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మరి బీసీ నాయకులు అవకాశం కలిపిస్తారా లేక కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం నాయకులకే ప్రాధాన్యం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.

గత ఏడాది ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి కూటమిని ముందుకు నడిపించడంలోనూ, కూటమిగా ముందుకు సాగడంలోను క్రియాశీలక పాత్ర పోషించారు. బయటకు ఆమె ఏమి చెప్పినా.. చెప్పకపోయినా అంతర్గతంగా అధిష్టానాన్ని కూట‌మి వైపు ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు అనేది అందరికీ తెలిసిన విషయం. వ్యక్తిగతంగా, రాజకీయపరంగా కూడా వైసీపీకి వ్యతిరేకమైన పురందేశ్వరి.. కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం కాలంలో కూడా ఎక్కడా విభేదాలు రాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో విమర్శలు వచ్చిన తట్టుకుని పోయేలాగా ఆమె వ్యవహరించారు.

ఏడాది కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగారు. చిన్న చిన్న విమర్శలు, చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సద్దుకుని పోయారు. ఇప్పుడు ఆమెను పక్కనపెట్టి కొత్త అధ్య‌క్షుడి ఎంపిక దిశగా పార్టీ అధిష్టానం అడుగులు వేసింది. ఈ క్రమంలో ఎవరిని ఎంచుకుంటారు.. అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రిగా కూడా పని చేసిన వ్యాపారవేత్త సుజనా చౌదరి, అలాగే కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదే విధంగా అనకాపల్లి ఎంపీ, వ్యాపారవేత్త సీఎం రమేష్ ఈ ముగ్గురు పోటీలో ఉన్నారనేది పార్టీ పరంగా జరుగుతున్న చర్చ.

ఇక మహిళా నాయకుల విషయానికి వస్తే పురందేశ్వరి వంటి నాయకులు గానీ ఆ స్థాయిలో రాజకీయం సాగించగలిగే మహిళా నేతలు గాని బిజెపికి లేరు. కాబట్టి ఈసారి కచ్చితంగా పురుష నాయకులకే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ సమస్య .ఎవరికి ఇచ్చినా కూటమిని ముందుకు నడిపించాలి. కూటమిని అర్థం చేసుకోవాలి. బిజెపి ప్రయోజనాలను కాపాడాలి. ఈ మూడు కీలకం. వీటితోపాటు ఆర్ఎస్ఎస్ వాదాన్ని పరిరక్షించేలాగా కూడా వ్యవహరించాలి. కాబట్టి ఎవరిని నియమిస్తారు అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ అనుబంధ నాయకులుగా ఉన్న కొంతమంది నేతలు కూడా తరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరిలో మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్, కడప జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మీరు రాజకీయంగా బిజెపితోనే ఎదిగారు. బిజెపితోనే పదవులు దక్కించుకున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వారు కొనసాగిస్తున్నారు. కాబట్టి వీరికి ఎక్కువ అవకాశం ఉంటుందనేది మరో చర్చ. ఏదేమైనా ఏపీ బీజేపీ పగ్గాలు ఎవరికి ఇచ్చినా పార్టీ మనుగడ, కూటమితో సఖ్యత అనేది వారికి తీవ్ర పరీక్ష గానే మారనున్నది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.