బ్రేకింగ్!… మహాన్యూస్ పై బీఆర్ఎస్ దాడి!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శనివారం మద్యాహ్నం తర్వాత ఓ దారుణ ఘటన జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు నగరంలోని జూబ్లీహిల్స్ లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడికి దిగిన వారు బీఆర్ఎస్ వారేనా? అన్న అనుమానాలను కూడా మహాన్యూస్ ఎండీ వంశీ నివృత్తి చేశారు. తమ పార్టీ నేత కేటీఆర్ మీద తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటామా? అంటూ దాడి చేసిన వారు చెప్పినట్లుగా ఆయన వెల్లడించారు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికా నుంచి వచ్చిన నాటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును వరుసగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ వ్యవహారాలపై మీడియా సంస్థలు పలు రకాల కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో మహాన్యూస్ కూడా పలు కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం మధ్యాహ్నం కేటీఆర్ ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ను చూసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు మహాన్యూస్ పైకి దాడికి పాల్పడ్డాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ దాడిలో మహాన్యూస్ కార్యాలయానికి ఓ మోస్తరు నష్టమే జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మహాన్యూస్ ఆఫీస్ కు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పొన్నంతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ లు మహాన్యూస్ కార్యాలయాన్ని సందర్శించి… దాడి జరిగిన తీరును గమనించారు. మహాన్యూస్ ఎండీ వంశీతో పాటు సిబ్బందికీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే నిందితుల కోసం పోలీసులను రంగంలోకి దించామని, ఐదారుగురు నిందితులు పట్టుబడిపోయారని పొన్నం చెప్పారు. ఆ తర్వాత సీపీఐ సీనియర్ నేత నారాయణ, డిప్యైటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా మహాన్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు.

ఇదిలా ఉంటే… మహాన్యూస్ దాడి జరిగిందన్న విషయం తెలయగానే టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాక్ కు గురయ్యారు. మీడియా సంస్థలపై ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సమాజం ప్రోత్సహించరాదని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ దాడిని ఖందించారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాన్యూస్ కార్యాలయంపై దాడికి తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థల రాసిన, ప్రసారం చేసిన విషయాలపై విశ్వాసం లేకపోతే నిరసన వ్యక్తం చేయవచ్చని, అయితే ఇలా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దాడులు జరగడం సరికాదని ఆయన అన్నారు.