తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంచి పట్టు కలిగిన రాజకీయ నేతగా గుర్తింపు సంపాదిం చుకున్న మాజీ ఎమ్మెల్పీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు మురళి రాగా… కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వచ్చీరాగానే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలోని కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. కమిటీకి తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పారు. ఇవ్వాలనుకున్న వినతి పత్రాలను, ఫిర్యాదులను అందజేశారు.
ఆ తర్వాత బయటకు వచ్చిన మురళి… మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీలో తనను ఏ ఒక్కరు కూడా ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదని చెప్పారు. అయితే తానే తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమగ్ర వివరణ ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాల్లో కొన్నింటిని మాటపూర్వకంగా చెప్పానన్న మురళి… మరికొన్ని విషయాలను పేపర్ రూపకంగా అదందజేశానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తాను నమ్మిన బంటునని చెప్పిన ఆయన బీసీల కోసం అహర్నశలు కష్టపడుతున్నానని తెలిపారు.
ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడగగా… మురళి వాటిలో కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చారు. తనను బెదిరించే యత్నం చేయొద్దన్న మురళి… చావుకు కూడా తాను భయపడనని పేర్కొన్నారు. ఇక కడియం శ్రీహరిపై వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావిస్తే… తాను బీఆర్ఎస్ నుంచి తిరిగి తన సొంత గూటికి చేరే సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసి మరీ వచ్చామని తెలిపారు. మరి కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది ఆయనకే వదిలేస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతోనే తాను సాగుతున్నానని కొండా వెల్లడించారు.
ఇక మల్లు రవికి కొండా మురళి ఇచ్చిన లేఖలో చాలా అంశాలే ఉన్నాయి. కడియం శ్రీహరితో పాటు వరంగల్ ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర వెంకటరమణ తదితరులపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. తన భార్య సురేఖ మంత్రి పదవిని ఊడగొట్టేలా కడియం విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇక రేవూరి, గండ్ర తమ మద్దతులో గెలిచి ఇప్పుడు తమకే వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ అన్నా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నా తనకు అత్యంత గౌరవం ఉందన్న కొండా… ఈ విషయాన్ని పక్కదారి పట్టేలా చేయొద్దని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates